మార్పు కోసం ముఖాముఖి

ABN , First Publish Date - 2022-11-04T00:47:38+05:30 IST

పాత నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజే్‌షచంద్ర గురువారం ముఖాముఖి నిర్వహించారు.

మార్పు కోసం ముఖాముఖి

పాత నేరస్థులకు జోన్‌ డీసీపీ రాజే్‌షచంద్ర కౌన్సెలింగ్‌

సత్ప్రవర్తతో మెలగాలని హితబోధ

35 మందిపై సస్పెక్ట్‌ షీట్‌ల తొలగింపు

రాంనగర్‌, నవంబర్‌ 3(ఆంధ్రజ్యోతి) : పాత నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజే్‌షచంద్ర గురువారం ముఖాముఖి నిర్వహించారు. చిక్కడపల్లి, ముషీరాబాద్‌, గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిల్లోని వివిధ కాలనీల్లో నివసిస్తున్న 381 మంది పాత నేరస్థుల స్థితిగతులపై ఆరా తీశారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఏసీపీ యాదగిరి, సీఐలు జహంగీర్‌యాదవ్‌, సంజయ్‌కుమార్‌, మోహన్‌రావు, డీఐలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో 166, గాంధీనగర్‌లో 140, చిక్కడపల్లిలో 75 మందిని విచారించారు. డీసీపీ ఒక్కొక్కరిని పిలిచి వారి గత చరిత్రను తెలుసుకున్నారు. దొంగతనాలు చేయడానికి దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. గతంలో ఎలాంటి దొంగతనాలు చేశారు? ప్రస్తుతం ఏమి చేస్తున్నారు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దం కిందట చోర వృత్తిని ఎంచుకున్న వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. సత్ఫ్రవర్తనతో మెలగాలని సూచించారు. చోరవృత్తికి దూరంగా ఉన్న 35 మందిపై సస్పెక్ట్‌ షీట్‌లను తొలగించాలని డీసీపీ నిర్ణయించారు. అందుకోసం ప్రతిపాదనలు పం పించాలని సీఐలకు డీసీపీ సూచించారు.

సత్ప్రవర్తన కోసమే సదస్సు

దొంగతనాల నివారణతోపాటు నేరస్తుల్లో మార్పు తీసుకురావడానికే సత్ప్రవర్తన సదస్సును ఏర్పాటుచేశాం. పాతనేరస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాం. చిక్కడపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో సస్పెక్ట్‌ షీట్‌లు ఉన్న వారందరినీ పిలిచి హితబోధ చేశాం. వారిలో మార్పు వస్తోందని భావిస్తున్నాం. గత నాలుగైదేళ్లగా దొంగతనాలకు దూరంగా ఉంటూ దర్జాగా బతుకుతున్న వారిపై సస్పెక్ట్‌ షీట్‌లు ఎత్తివేస్తాం. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే సస్పెక్ట్‌ షీట్‌లు తెరుస్తాం.

- డీసీపీ రాజే్‌షచంద్ర

తరచూ నిఘా

పోలీస్‌ స్టేషన్లలో సస్పెక్ట్‌ షీట్‌ ఉండే వారిపై తరచూ నిఘా ఉంటుంది. అనుమానం వస్తే వారిని పోలీస్‌ స్టేషన్‌కు పిలవడం జరుగుతుంది. డీసీపీ రాజే్‌షచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమం సత్ఫలితాలు సాధిస్తోంది. పాత నేరస్తులు కొంత కాలంగా దొంగతనాలకు దూరంగా ఉన్నారని గుర్తించాం. అలాంటి వారిపై ఉన్న సస్పెక్ట్‌ షీట్‌ను తొలగిస్తాం.

- జహంగీర్‌యాదవ్‌, ఇన్‌స్పెక్టర్‌, ముషీరాబాద్‌ పీఎస్‌

Updated Date - 2022-11-04T00:47:44+05:30 IST