డ్రైవర్ నిద్రమత్తు.. ప్రాణాలు చిత్తు!
ABN , First Publish Date - 2022-11-01T04:10:51+05:30 IST
మితి మీరిన వేగానికి తోడు, డ్రైవర్ నిద్రమత్తు అతడు సహా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది...
కండ్లకోయ వద్ద ఔటర్‌పై ఘోర ప్రమాదం
ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్న వింగర్
ముగ్గురి దుర్మరణం.. 9 మందికి గాయాలు
వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల పరిస్థితి విషమం
దైవదర్శనానికి వెళ్లొస్తుండగా విషాదం
మరో చోట లారీని ఢీకొన్న బైక్.. టీచర్ మృతి
ఒక ఉపాధ్యాయుడి మృతి.. మరో టీచర్ కోమాలో
రెండూ ప్రమాదాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే
మేడ్చల్, జిన్నారం, గుమ్మడిదల, చిలి్‌పచెడ్, దౌల్తాబాద్, కొడంగల్ రూరల్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): మితి మీరిన వేగానికి తోడు, డ్రైవర్ నిద్రమత్తు అతడు సహా ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది! ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళుతున్న కారు, ముందు వెళుతున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 13 మందిలో ముగ్గురు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది! మృతుల్లో ఇద్దరు తోడల్లుళ్లు కాగా.. చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది సొంత అక్కాచెల్లెళ్లు! డ్రైవర్ మినహా మృతులు, క్షతగాత్రులు అంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. దైవదర్శనానికి వెళ్లిన మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదాన బారిన పడి మృతిచెండంతో బాధితుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. మరో ఘటనలో నిలిచివున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యాడు. మరొకరు తీవ్రగాయాలతో కోమాలో ఉన్నారు.
ఈ రెండు ప్రమాదాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగాయి. బాధిత కుటుంబసభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్‌గుప్తాకు కిరాణదుకాణం ఉంది. ఆదివారం సెలవురోజు కావడంతో శంకర్‌గుప్తా, చిట్కూల్‌కు చెందిన ఆయన సడ్డకుడు (మరదలి భర్త) సురేశ్ గుప్తా తమ తమ కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని ఏపీలోని శ్రీశైలం వెళ్లాలనుకున్నారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన 12 మంది (డ్రైవర్‌తో కలిపి 13 మంది) గుమ్మడిదలకు చెందిన నరసింహారెడ్డి వింగర్ వాహనాన్ని మాట్లాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరారు. శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు.
అదేరోజు రాత్రి 12 సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహం ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి మేడ్చల్ జిల్లా కండ్లకోయ వద్దకు చేరుకుంది. అక్కడ మితిమీరిన వేగంతో ఎదురుగా వెళుతున్న ట్రక్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్‌గుప్తా (46), సురేశ్ గుప్తా (48), డ్రైవర్ నరసింహారెడ్డి(30) అక్కడికక్కడే మృతిచెందారు. మరో తొమ్మిది మందికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు. వారిలో శంకర్ గుప్త భార్య, సురేశ్ గుప్త భార్య (సొంత అక్కచెల్లెళ్లు) పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఆ టీచర్ల ఇళ్లలో విషాదం
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని గోకఫస్లాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని బోడమర్రిగడ్డ తండాకు చెందిన నాన్యనాయక్ (46), దౌల్తాబాద్‌కు చెందిన బందెప్ప (47) ప్రభుత్వ ఉపాఽధ్యాయులు. నాన్య నాయక్ దౌల్తాబాద్ మండలం చల్లాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా, బందెప్ప దుద్యాల్ మండలం హకీంపేట్ జడ్పీహెచ్‌ఎ్‌సలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి ఆదివారం వికారాబాద్‌లో ఉపాధ్యాయుల సమావేశానికి బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కొడంగల్ శివారులోని నీటూర్ గేటు దగ్గర రోడ్డుపై నిలిచి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. నాన్యనాయక్ మృతి చెందగా బందెప్పకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను స్థానికులు చికిత్స నిమిత్తం తొలుత కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన కోమాలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.