CV Anand: దేశంలో 11 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలు

ABN , First Publish Date - 2022-12-18T12:33:56+05:30 IST

హైదరాబాద్‌ నగరాన్ని డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా మార్చాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

 CV Anand: దేశంలో 11 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలు

హైదరాబాద్‌ సిటీ/నాచారం: హైదరాబాద్‌ నగరాన్ని డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా మార్చాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ యువతకు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో 1000 మంది విద్యార్థులతో సీపీ యాంటీ డ్రగ్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌ ఈస్టుజోన్‌ పరిధిలోని 55 కళాశాల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. సీపీ మాట్లాడుతూ సరదా కోసం మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటున్న యువత మెల్లమెల్లగా దానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇప్పటికే తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ చేసినప్పుడు వారి పిల్లలు డ్రగ్స్‌ బానిసైన విషయం తెలిసి షాకవుతున్నారు. నార్కోటిక్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌లను ఏర్పాటు చేసి డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సిటీ పరిధిలో 855 కళాశాలల్లో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దేశంలో 140 కోట్ల మందిలో 11 కోట్ల మంది డ్రగ్స్‌ బారిన పడినట్లుగా నివేదికలు చెబుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ నగరంగా మార్చాలని అన్నారు. డ్రగ్స్‌ వలన కలిగే ఇబ్బందులను సైకియాట్రిస్ట్‌ సందీప్‌ వివరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ సునీల్‌దత్‌, హెచ్‌-న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మినారాయణ, ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేష్‌, పలువురు ఏసీపీలు, సీఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-18T12:33:58+05:30 IST