Ramakrishna Math: సెప్టెంబర్ 11న స్వామి వివేకానంద మహిమ పేరిట సంగీత విభావరి
ABN , First Publish Date - 2022-09-10T23:40:53+05:30 IST
హైదరాబాద్: స్వామి వివేకానంద చికాగో విశ్వమత ప్రతినిధుల సభలో ప్రసంగించి 129 సంవత్సరాలైన సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ...
హైదరాబాద్: స్వామి వివేకానంద చికాగో విశ్వమత ప్రతినిధుల సభలో ప్రసంగించి 129 సంవత్సరాలైన సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత భక్తులు అక్కడి నుంచి ర్యాలీగా రామకృష్ణ మఠానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో స్వామి వివేకానంద మహిమ పేరిట సంగీత విభావరి నిర్వహించనున్నారు. బెంగళూరుకు చెందిన వోకలిస్ట్ సురమణి డాక్టర్ దత్తాత్రేయ వెలాంకర్, తబ్లా వాయిద్యకారుడు యోగేశ్ భట్ ఈ విభావరిలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.
ఈ నెల 13న వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ తదితరులు హాజరౌతున్నారు.
2000 సంవత్సరంలో.. నాటి హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి రంగనాథానంద ఆధ్వర్యంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రారంభమైంది. నాటి నుంచీ వీఐహెచ్‌ఈ ద్వారా ఇప్పటివరకూ 22 లక్షలకు మంది ప్రయోజనం పొందారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కోర్సులతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను అధిగమించడంపై ఎన్నో కార్యక్రమాలు, యోగా, ధ్యానం తరగతులు నిరంతరం నిర్వహిస్తున్నారు.