Conocarpus plants: మొక్కే కదా అని పెంచితే..

ABN , First Publish Date - 2022-11-21T03:22:15+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏయేటికాయేడు అప్రతిహతంగా సాగుతుండగా...

Conocarpus plants: మొక్కే కదా అని పెంచితే..

హరితహారంలో భారీగా నిషేధిత కోనోకార్పస్‌ మొక్కలు

ఈ మొక్కల పుప్పొడితో శ్వాసకోశ వ్యాధులు

ఆకులను పశువులు తినవు.. చెట్టుపై పక్షులు వాలవు

జీవ వైవిఽధ్యం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం

భూగర్భంలోని పైప్‌లైన్లు, కేబుల్‌ వ్యవస్థకూ నష్టం

ఖతార్‌, కువైట్‌ దేశాల్లో ఈ మొక్క నిర్మూలనకు చర్యలు

ఆ చెట్లపై పక్షులు వాలవు! వాటి ఆకులను పశువులు తినవు! కారణం.. అది విష వృక్షం కనక! వాటి పుప్పొడితో శ్వాసకోస వ్యాధులు వస్తాయి! ప్రపంచ దేశాలు ఆ మొక్కను నిషేధించాయి! కానీ, హరిత హారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆ మొక్క లను నాటారు! ఆలస్యంగా గుర్తించి నిషేధించారు. కానీ, తొలగించట్లేదు! మొక్కే కదా అని ఊరుకోకుండా పీకేయడమే తక్షణ పరిష్కారం!!

ఓరుగల్లు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏయేటికాయేడు అప్రతిహతంగా సాగుతుండగా.. ఆ మహాయజ్ఞంలో విష గుళిక ప్రవేశించింది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఈ బృహత్‌కార్యక్రమంలో హాలాహలం ఉప్పొంగేలా చేస్తోంది. ఇక్కడ.. అక్కడ అని కాకుండా.. మహా నగరాలు మొదలు.. గ్రామాలు, తండాల దాకా ఆ ప్రతికూల ప్రభావ కారకం విస్తరించిపోయింది. ఆ విష గుళిక పేరు కోనోకార్పస్‌. కంబ్రాటేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఎందుకూ పనికిరాదు. దీని ఆకులను పశువులు తినవు. పక్షులు ఈ చెట్టుపై వాలవు. కీటకాలు దీని దరిచేరవు. కోనోకార్పస్‌ నీడలో చివరకు పచ్చిగడ్డి కూడా మొలవదు. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించే ఈ మొక్క వేర్లు.. భూమిలోపల అడ్డొచ్చే డ్రైనేజీ వ్యవస్థలను, పైప్‌లైన్లను, కేబుళ్లను చీల్చుకుని వెళ్తాయి. అన్నింటికీ మించి.. కోనోకార్ప్‌సతో మానవాళికి శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఎక్కువ..! ప్రపంచదేశాలు.. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాలు ఈ మొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని దీని పెంపకంపై ఏనాడో నిషేధాలు విధించాయి. మన రాష్ట్రంలో మాత్రం హరితహారంలో భాగంగా కోనోకార్ప్‌సను ఇబ్బడిముబ్బడిగా నాటేశారు. ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్లుగా ఇప్పుడీ విషపు మొక్క గ్రేటర్‌ నగరాలు మొదలు మారుమూల తండాలు, ఏజెన్సీల్లో కూడా ఏపుగా పెరిగిపోయాయి. ఈ మొక్క ప్రతికూల ప్రభావాలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 15న కోనోకార్ప్‌సపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా హరితహారంలో ఈ మొక్కను నాటొద్దంటూ సర్క్యులర్‌ జారీ చేశారు. అయినా.. చాలా గ్రామపంచాయతీల్లో వీటిని బేఖాతరు చేస్తూ నాటేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌తోపాటు.. కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రధాన రహదారుల్లో డివైడర్ల మధ్యలో ఈ మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. హైదరాబాద్‌ శివారు గ్రామపంచాయతీల్లోని నర్సరీల్లో ఈ మొక్కలు పెద్దసంఖ్యలో ఉండడంతో.. జూలై, ఆగస్టు నెలల్లో హడావుడిగా కాలనీల్లో నాటేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని కాచ్వానిసింగారం గ్రామపంచాయతీ అధికారులు ఏకంగా తమ పరిధిలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లోని పార్కుల్లో రెండు-మూడేసి వరసల్లో ఈ మొక్కలను నాటారు.

ఆరోగ్యానికి ముప్పు

విదేశీ మొక్క అయిన కోనోకార్పస్‌ మన వాతావరణ సమతౌల్యతను దెబ్బతీస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇది సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మడ జాతి మొక్క అని వివరిస్తున్నారు. దీని పుప్పొడి వల్ల అస్తమా, అలర్జీ లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వివరించారు. పశువులు, పక్షులకు ఉపయోగపడని ఈ చెట్లు జీవ వైవిధ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవిడ్‌ బారిన పడి కోలుకున్నవారికీ కోనోకార్పస్‌ మొక్కలతో ప్రమాదం పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఈ మొక్క పెంపకంపై నిషేధం విధించినా.. ఇప్పటికే నాటిన మొక్కలు పెరిగి, పెద్దవయ్యాయి. వీలైనంత తొందరగా ఈ మొక్కలను తొలగించి.. వాటి స్థానంలో దేశీయ మొక్కలు నాటాలని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అమెరికా నుంచి వచ్చిన మొక్క..

కోనోకార్పస్‌ మొక్క మొదట్లో అమెరికా తీర ప్రాంతాలకే పరిమితమయ్యేది. ముఖ్యంగా ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో మంగ్రూవ్‌ జాతి మొక్కగా దీన్ని పిలుస్తారు. వేగంగా, ఏపుగా పెరిగి, పచ్చదనంతో అలరిస్తుంది. ఈ మొక్క గల్ఫ్‌ దేశాల ప్రభుత్వాలను ఆకట్టుకుంది. ఏడారుల నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లు, వేడి గాలుల నుంచి రక్షణ గోడలా ఉంటాయని అక్కడ విస్తృతంగా నాటారు. ఏడారి దేశాల్లో పచ్చదనం వెల్లివిరిసింది. ఆయా దేశాలను సందర్శించిన మన ప్లాంటేషన్‌ నిపుణులు.. దీన్ని భారత్‌కు తీసుకువచ్చారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఈ మొక్క పాతుకుపోయింది.

గల్ఫ్‌ దేశాల గగ్గోలు

ఎడారి దేశాల్లోనూ పచ్చదనాన్ని ప్రసాదించిన ఈ మొక్క ఇరాన్‌, పాకిస్థాన్‌ సర్కార్లనూ ఆకట్టుకుంది. క్రమంగా కోనోకార్పస్‌ దుష్ప్రభావాలను గుర్తించి, కువైట్‌, ఖతార్‌, యూఏఈ ప్రభుత్వాలు నిషేధాన్ని విధించాయి. మన దాయాది దేశం పాకిస్థాన్‌ కూడా ఈ మొక్క దుష్ప్రభావాలను తీవ్రంగా ఎదుర్కొంది. ఆ దేశంలో డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ల వ్యవస్థను ఈ మొక్క కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. కరాచీ నగరంలో పీల్చే గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. కరాచీ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఈ విషయాన్ని నిర్ధారిస్తూ.. కరాచీనగరంలో ఆస్తమా రోగుల సంఖ్య పెరగడానికి కోనోకార్పస్‌ మొక్కలే కారణమని తేల్చింది. ఇరాన్‌లో ఈ మొక్క వల్ల మౌలిక వసతులకు కలిగిన నష్టాలపై మిసాన్‌ విశ్వవిద్యాలయం 2020లో ఏకంగా ఓ పరిశోధన పత్రాన్ని సమర్పించింది. అక్కడి నగరాల్లోనూ డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్లను కోనోకార్పస్‌ తీవ్రంగా దెబ్బతీసింది.

తీవ్ర దుష్పరిణామాలు

- ముస్తఫా, కేయూ వృక్షశాస్త్ర విభాగాధిపతి

కోనోకార్పస్‌ ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలబడుతుంది. ఇతర మొక్కలతో పోలిస్తే వేగంగా పెరుగుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు దీన్ని ప్రోత్సహించాయి. తదనంతరం కాలాల్లో దీని దుష్పరిణామాలను అర్థం చేసుకుని నిషేధించాయి. ఈ మొక్కతో ఉన్నన్ని అనర్థాలు ఏ మొక్కలోనూ కనిపించవు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

Updated Date - 2022-11-21T12:06:44+05:30 IST