Sardar Mahal: సర్దార్ మహల్‌కు మహర్దశ
ABN , First Publish Date - 2022-12-05T12:56:26+05:30 IST
శిథిలావస్థకు చేరిన పాతబస్తీలోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయానికి (సర్దార్ మహల్) మహర్దశ పట్టనుంది.
పునరుద్ధరణకు డిజైన్లు సిద్ధం
హైదరాబాద్ సిటీ: శిథిలావస్థకు చేరిన పాతబస్తీలోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయానికి (సర్దార్ మహల్) మహర్దశ పట్టనుంది. వారసత్వ కట్టడమైన సర్దార్ మహల్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నగర నడిబొడ్డున గ్రామీణ వాతావరణం నెలకొల్పేలా సందర్శకులకు సదుపాయాలు కల్పించనున్నారు. ఆర్ట్ గ్యాలరీతో పాటు స్డూడియో, కేఫ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
చార్మినార్ పరిసర ప్రాంతాలను సందర్శించే వారికి అక్కడే వసతి ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దనున్నారు. రాజస్తాన్‌లోని నిమ్రాన్ హోటల్ (వారసత్వ రిసార్ట్స్) తరహాలో సర్దార్ మహల్‌ను ఆధునీకరించనున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్, స్పెషల్ సీఎస్ అర్వింద్‌కుమార్ ట్విట్టర్‌లో వెల్లడించారు. పనులు చేపట్టేందుకు కులీకుతుబ్‌షా అర్భన్ డెవల్‌పమెంట్ ఆథారిటీ (కుడా)తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. సర్దార్ మహల్‌కు కిలోమీటర్ దూరంలో ఉన్న ఖుర్షీద్ జా దెవ్డీ చారిత్రక భవనాన్ని కూడా పునరుద్ధరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.