మళ్లీ కిటకిటలాడుతున్న మెట్రోరైళ్లు.. అనూహ్యంగా..!
ABN , First Publish Date - 2022-03-22T14:38:12+05:30 IST
మెట్రోరైళ్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. నెల క్రితం వరకు అరకొర ప్రయాణికులతో...
- మెట్రో వైపు పయనం
- కిటకిటలాడిన ఎల్‌బీనగర్-మియాపూర్ కారిడార్
- సోమవారం 1.50 లక్షలకు పైగా మంది..
హైదరాబాద్ సిటీ : మెట్రోరైళ్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. నెల క్రితం వరకు అరకొర ప్రయాణికులతో బోసిపోయిన బోగీలు కళకళలాడుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు పెద్ద ఎత్తున మెట్రోను ఆశ్రయిస్తుండడంతో వివిధ మార్గాల్లోని స్టేషన్లు సందడిగా కనిపిస్తున్నాయి. కొవిడ్ ముందు ఆయా కారిడార్లలో రోజుకు 3.80 లక్షల నుంచి 4.10 లక్షల మంది వరకు రాకపోకలు సాగించేవారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు మెట్రో రవాణాను సద్వినియోగం చేసుకునేవారు. కొవిడ్ అనంతరం ఐటీ కార్యాలయాలు మూతపడడం వంటి కారణాలతో మెట్రోను ఆశ్రయించేవారి సంఖ్య తగ్గిపోయింది.
అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు
ఐటీ కంపెనీలు 80 శాతం వరకు తెరుచుకోవడంతో ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో మెట్రోస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. దీంతో సోమవారం ఎల్‌బీనగర్-మియాపూర్ మార్గంలో సుమారు 1.50 లక్షలకు పైగా మంది మెట్రోలో ప్రయాణించారు. మరికొన్ని రోజుల్లో పాత ప్రయాణికుల సంఖ్యకు చేరుతామనే నమ్మకం ఉందని ఎల్‌అండ్‌టీ వర్గాలు చెబుతున్నాయి.