కొత్త డీజీపీ అంజనీకుమార్
ABN , First Publish Date - 2022-12-30T04:10:31+05:30 IST
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. ఆయనను ఇన్‌చార్జి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
ఇన్‌చార్జి బాధ్యతల అప్పగింత
సీఎస్, డీజీపీ ఇద్దరూ ఏపీ క్యాడరే
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్
అవినీతి నిరోధకశాఖ డీజీగా రవిగుప్తా
సీఐడీ చీఫ్‌గా మహేశ్ భగవత్
రాచకొండ సీపీగా డీఎస్ చౌహాన్
శాంతిభద్రతల అదనపు డీజీగా సంజయ్
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు
త్వరలో మరిన్ని బదిలీలకు రంగం సిద్ధం
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్
చైర్మన్‌గా మహేందర్ రెడ్డి!
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. ఆయనను ఇన్‌చార్జి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగియనుంది. ఆయన నుంచి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు. ఆయనకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు. హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.
ప్రస్తుత బదిలీలన్నీ అదనపు డీజీ, డీజీ క్యాడర్‌కు చెందిన పోస్టులకు సంబంధించినవి కాగా.. త్వరలో మరికొందరు ఐపీఎ్‌సలకు-- ఎస్పీ స్థాయి అధికారి మొదలు.. అదనపు డీజీ దాకా-- స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది. కాగా.. డీజీపీ మహేందర్‌రెడ్డి కొంతకాలం అనారోగ్యంతో సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్ ఇన్‌చార్జి డీజీపీగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను డీజీపీగా నియమించడం ఓ ఆనవాయితీగా మారింది. అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి అలా హైదరాబాద్ సీపీ స్థానం నుంచి డీజీపీలుగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీలో పలుమార్లు కొనసాగిన ఆనవాయితీ ప్రకారం ఈ సారి ఏసీబీ డీజీని డీజీపీగా నియమించారు.
చీఫ్‌లు ఇద్దరూ ఏపీ క్యాడర్‌కు చెందినవారే..!
పరిపాలన పరంగా అత్యున్నత పదవిగా భావించే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో సోమేశ్‌కుమార్, పోలీసింగ్ పరంగా డీజీపీ పదవిలో అంజనీకుమార్-- ఇద్దరూ ఏపీ క్యాడర్‌కు చెందిన అధికారులే. వీరిద్దరూ బిహార్‌కు చెందినవారు కావడం మరో విశేషం రాష్ట్ర విభజన సమయంలో వీరిద్దరినీ ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. అంజనీకుమార్ హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతుండగా.. సోమేశ్‌కుమార్ క్యాడర్ విషయంపై హైకోర్టులో వ్యాజ్యం కొనసాగుతోంది. వచ్చేనెల తుదితీర్పు రానుంది. హైకోర్టు తీర్పు ప్రభావం అంజనీకుమార్ నియామకంపై పడే అవకాశాలున్నాయి. ఒకవేళ సోమేశ్‌కుమార్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. అంజనీకుమార్‌ను పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ఇన్‌చార్జి డీజీపీగానే ఉంటారని తెలుస్తోంది.
అంజనీకుమార్.. జనగాంలో ఏఎస్పీగా ప్రస్తానం
1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్.. శిక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ జిల్లా జనగాం ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంజనీ కుమార్ సమర్థంగా విధులు నిర్వర్తించారు. గత ఏడాది డిసెంబరు 25 నుంచి ఇప్పటి వరకు ఏసీబీ డీజీగా 74 ట్రాప్, 17 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అంజనీ కుమార్ పర్యవేక్షణలో నమోదయ్యాయి. 2018-21 మధ్య కాలంలో ఆయన హైదరాబాద్ సీపీగా సేవలందించారు. 2016-18 మధ్య అదనపు డీజీపీ(శాంతిభద్రతలు), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు సీపీ(శాంతిభద్రతలు), గ్రేహౌడ్స్ చీఫ్‌గా పనిచేశారు. సీఐసెల్ డీఐజీ, నిజామాబాద్ రేంజ్, గుంటూరు రేంజ్‌లకు డీఐజీగా, కేంద్ర సర్వీ్‌సల్లో సీఐఎ్‌సఎఫ్ ఏఐజీగా, 1998-99 మధ్య ఇంటర్నేషనల్ డిప్యూటేషన్‌పై భారతదేశం తరపున యూఎన్ ఇంటర్నేషనల్ పోలీస్ టాస్క్‌ఫోర్స్(ఐపీటీఎ్‌ఫ)లో విధులు నిర్వర్తించారు.
రెండుసార్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) పీస్ మెడల్‌ను అందుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉత్తమ పనితీరుకుగాను ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ చరిత్రపై విస్తృ పరిశోధన చేసిన అంజనీ కుమార్.. ప్రత్యేకంగా కాఫీ టేబుల్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. అంజనీ కుమార్ హైదరాబాద్ పీసీగా ఉన్న సమయంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అవసరమైన వారికి అత్యవసర సేవలు అందించారు. బీహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జెవియర్ పాఠశాల, ఢిల్లీ యూనివర్సిటీలో అంజనీకుమార్ విద్యనభ్యసించారు. ఐపీఎ్‌సగా శిక్షణలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు కప్పులు గెలుపొందారు. గుర్రపు స్వారి, ఫోటోగ్రఫీ ఆయన హాబీలు. ఆయన సతీమణి వసుంధర ప్రస్తుతం ఆదాయపన్ను శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి..!
డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ తర్వాత కూడా ఆయన సేవల్ని ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బంజారహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవన సముదాయం ప్రారంభోత్సవ సమయంలో ఆయన ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అందుకు తగ్గట్లుగానే తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీఎ్‌సపీఐసీసీసీ)కు మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించాలని సీఎం సంకల్పించినట్లు తెలిసింది. ఆయన డీజీపీ పదవికి పదవీ విరమణ చేయగానే.. టీఎ్‌సపీఐసీసీసీకి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.