పీహెచ్‌సీలకు కొత్త డాక్టర్లు వస్తున్నారు!
ABN , First Publish Date - 2022-12-20T03:49:06+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీరనుంది. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టుల ఫలితాలను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదల.. వారంలో పోస్టింగ్
ఎంపికైన వారికి మంత్రి హరీశ్ అభినందనలు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీరనుంది. 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) పోస్టుల ఫలితాలను తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734, వైద్య విధాన పరిషత్‌లో 209, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఏడుగురు సీఏఎ్‌సలు ఎంపికయ్యారు. వీరి రాకతో పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత తీరనుంది. వారంలోగా వీరందరికీ కౌన్సెలింగ్ ముగించి, పోస్టింగ్ ఇవ్వనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం విశేషం. డీపీహెచ్, టీవీవీపీ, ఐపీఎం పరిధిలో 969 పోస్టుల భర్తీకి జూన్ 15న నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 4803 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి గత నెల 9న ప్రాథమిక మెరిట్ జాబితా, అభ్యంతరాలను పరిశీలించాక 20న రెండో మెరిట్ జాబితా విడుదల చేసింది. 22 నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించింది. 950 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ సోమవారం జాబితాను ప్రకటించింది. 19 పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు అభ్యర్థులు లేకపోవడంతో తదుపరి నోటిఫికేషన్‌లో కలపనున్నారు.
మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్
సీఏఎస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల ఆధారంగా ఆయా విభాగాధిపతులు మెరిట్ జాబితా రూపొందించనున్నారు. అభ్యర్థులకు నాలుగు పీహెచ్‌సీలను ఆప్షన్లుగా ఇస్తారు. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఇప్పటికే ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌సీల్లోని ఖాళీల వివరాలు తెప్పించుకున్నారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో ఖాళీలు ఉన్నచోట సీఏఎ్‌సలకు పోస్టింగ్ ఇవ్వనున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో కూడా సీఏఎస్ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకాలతో కొంతమేర కొరత తీరనుంది. ఎంపికైన వైద్యుల్లో సగానికి పైగా (50.68 శాతం) మహిళలే ఉన్నారు. మొత్తం 950 మందిలో 481 మంది లేడీ డాక్టర్లే ఉండటం విశేషం. బీసీ-ఈ కేటగిరీలో 16 పోస్టులు ఉంటే 15 మహిళలకే దక్కాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో 26కు 18 పోస్టుల్లో లేడీ డాక్టర్లే ఎంపికయ్యారు. ఎస్సీ కేటగిరీలో 39కి 29 పోస్టులను మహిళలే సాధించారు.
పారదర్శకంగా ఎంపిక: మంత్రి హరీశ్
సీఏఎస్ పోస్టుల భర్తీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనలో మరో ముందడుగు అని మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రకియను పారదర్శకంగా పూర్తిచేసిన బోర్డును అభినందించారు. సీఏఎ్‌సలను ఉద్దేశించి.. ‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించేందుకు ఎంపికైన మీకు స్వాగతం. శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.