Greater Hyderabad: కాంగిరేస్
ABN , First Publish Date - 2022-12-11T12:44:17+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్‌లో సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీకి
మూడు జిల్లాలుగా సిటీ
రెండు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
పెండింగ్‌లో సికింద్రాబాద్.. నేడో రేపో ప్రకటించే అవకాశం
హైదరాబాద్‌కు సమీర్.. ఖైరతాబాద్‌కు రోహిణ్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో సంస్థాగతంగా బలోపేతమయ్యేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీకి నగరంలో పునర్‌వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాను పార్టీ కార్యక్రమాల సౌలభ్యం కోసం మూడు జిల్లాలుగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) విభజించగా, రెండు జిల్లాలకు అధ్యక్షులతోపాటు కమిటీని ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వలీఉల్లా సమీర్‌ను, ఖైరతాబాద్ జిల్లాకు సింగిరెడ్డి రోహిణ్‌రెడ్డిలను నియమించారు. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడితోపాటు కమిటీని ఇంకా ఖరారు చేయలేదు. రేపో, మాపో ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత తెలిపారు.
రాష్ట్రానికి గుండెకాయలాంటి హైదరాబాద్ అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే.. నగరంపై పట్టు సాధిస్తే రాష్ట్ర రాజకీయాలను మరింత ప్రభావితం చేయవచ్చని పార్టీలు భావిస్తుంటాయి. హైదరాబాద్‌లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఇప్పటికే బీజేపీ మూడు జిల్లాలను ఏర్పాటు చేసి, మూడు కమిటీలను నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో పార్టీ కార్యక్రమాలను ఒక కమిటీతో నడిపించడం సవాల్‌గా మారడంతో మూడు జిల్లాలవైపు కాంగ్రెస్ కూడా మొగ్గు చూపింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు ఖైరతాబాద్ జిల్లాలుగా విభజించి కమిటీలను ఏర్పాటు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే అత్యధికంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కావడంతో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్టీ పిలుపులను విజయవంతం చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ పరంగా మూడుగా విభజించాలని టీపీసీసీ నిర్ణయించగా, ఏఐసీసీ ఆమోదముద్ర వేసింది. సాధారణ ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశం ఉండడంతో జిల్లా కమిటీలతోపాటు నియోజకవర్గ సమన్వయ, డివిజన్ కమిటీలను సత్వరమే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతోపాటు బూత్‌ల వారీగా కేంద్రీకరించి పని చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సికింద్రాబాద్‌కు రేపో, మాపో..
హైదరాబాద్, ఖైరతాబాద్ జిల్లాలకు కమిటీలను ప్రకటించగా సికింద్రాబాద్ జిల్లాకు కమిటీని ఖరారు చేయలేదు. సికింద్రాబాద్ జిల్లా పరిధిలో ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, బహద్దూర్ పురా, చార్మినార్, యాకత్‌పురా నియోజకవర్గాలు, ఖైరతాబాద్ జిల్లా పరిధిలో కార్వాన్, నాంపల్లి, ఖైరతాబాద్, అంబర్‌పేట, గోషామహల్, నియోజకవర్గాలున్నాయి.
సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అంజనీకుమార్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్‌ను సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే తండ్రి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతుండగా, కుమారుడిని సికింద్రాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా నియమిస్తే ఒకే కుటుంబానికి పరిమితం చేశారనే అపవాదు మూట కట్టుకోవాల్సి వస్తుందని వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. సికింద్రాబాద్ జిల్లా కమిటీ త్వరలోనే ఖరారు చేసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు దిశా, నిర్దేశం చేసే అవకాశాలున్నాయి. ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు భాగాలుగా విభజించి సంస్థాగతంగా బలోపేతం కావడానికి అడుగులు వేశాయి. కానీ, బీఆర్‌ఎస్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్‌కు ఒకే కమిటీకి పరిమితమైంది.