దరఖాస్తు చేయని వ్యక్తికి అత్యున్నత పోస్టు!

ABN , First Publish Date - 2022-10-31T12:26:15+05:30 IST

ఫైనాన్స్‌ ఆఫీసర్‌ నియామకాలపై హైకోర్టు అక్షింతలు వేస్తున్నా జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌)అధికారులు

దరఖాస్తు చేయని వ్యక్తికి అత్యున్నత పోస్టు!

జేఎన్‌టీయూహెచ్‌లో ఎఫ్‌వో నియామకంపై దుమారం

ఉద్యోగ విరమణ చేసిన వారిని ఎంపిక చేయడంపై విమర్శలు

గతంలోనూ ఇదే తీరు

హైకోర్టు అక్షింతలు

హైదరాబాద్/జేఎన్‌టీయూ: ఫైనాన్స్‌ ఆఫీసర్‌ నియామకాలపై హైకోర్టు అక్షింతలు వేస్తున్నా జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌)అధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులకు అనుకూలంగా ఉన్న వారిని ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నారు. తాజాగా టీఎస్‌ ఆర్టీసీలో డిప్యూటీ చీఫ్‌ ఏవోగా ఉద్యోగ విరమణ చేసిన డా. ఎం. సుందర్‌ నియామకంపై వర్సిటీలో దుమారం రేగుతోంది. సుందర్‌ నియామకం వర్సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈనెల 28న రిజిస్ర్టార్‌ ఆయనను ఫైనాన్స్‌ ఆఫీసర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఈ పోస్టు కోసం వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేయగా సుందర్‌ దరఖాస్తు చేయలేదు. నిబంధనల ప్రకారం సర్వీసులో ఉన్న వారినే ఎఫ్‌వోగా నియమించావాలని కోర్టు వర్సిటీ అధికారులకు సూచించినట్లు తెలిసింది.

కనీసం ముగ్గురు పేర్లు ప్రభుత్వానికి పంపిస్తే.. వాటిలో నుంచి ఒకరిని ఎంపిక చేయాలని, అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు నియమించడం సరికాదని, ఇప్పటి వరకు పనిచేసిన జనార్దన్‌రావు విషయంలో వర్సిటీ ఉన్నతాధికారులకు హైకోర్టు గతంలో అక్షింతలు వేసింది. అప్పట్లో రూల్‌ పాటించకుండా ఒక్కరినే నియమించడం, అదీ రిటైర్‌ అయిన వ్యక్తిని ఎఫ్‌వోగా నియమించడంపై వర్సిటీలోని పలువురు ఉద్యోగులు 2020లో హైకోర్టును ఆశ్రయించగా.. ఆ నియామకం తప్పు అని 2021లో కోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తగా నియమించిన ఎఫ్‌వోను నవంబర్‌ 2న జరిగా వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ర్యాటిఫికేషన్‌ చేయించే పనిలో కొందరు అధికారులు ఉన్నారు. సదరు నియామకం సరైంది కాదన్న విషయం పాలకవర్గ సభ్యులకు తెలిసినా.. ఈసీ సమావేశంలోనైనా దీన్ని పక్కన పెడతారా లేక వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాలకు తల ఊపి అంగీకరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదేశం

మా రూల్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. సర్కారు కొత్త వ్యక్తిని ఏవోగా నియమించమని ఆదేశించింది. దాని ప్రకారమే సుందర్‌కు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇచ్చాం. కోర్టు లేదా ప్రభుత్వం నుంచి అభ్యంతరాలుంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం

- డా.ఎం.మంజూర్‌ హుస్సేన్‌,

రిజిస్ర్టార్‌, జేఎన్‌టీయూహెచ్‌

Updated Date - 2022-10-31T12:26:18+05:30 IST