Ts Governor Tamilisai: నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు అనుమానం...
ABN , First Publish Date - 2022-11-09T17:27:39+05:30 IST
కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్‌భవన్.. ప్రగతి భవన్ (Raj Bhavan Pragati Bhavan) కాదని, ఫామ్ హౌస్ కేసులో రాజ్‌భవన్‌ను ఇరికించాలని చూశారని ఆరోపించారు.
హైదరాబాద్: కేసీఆర్ (KCR) ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై మరోసారి విరుచుకుపడ్డారు. రాజ్‌భవన్.. ప్రగతి భవన్ (Raj Bhavan Pragati Bhavan) కాదని, ఫామ్ హౌస్ కేసులో రాజ్‌భవన్‌ను ఇరికించాలని చూశారని ఆరోపించారు. గతంలో తుషార్ రాజ్‌భవన్‌లో ఏడీసీగా పనిచేశారని, తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారని విమర్శించారు. ఏ విషయంపై అయినా మాట్లాడేందుకు సిద్ధమని తమిళిసై స్పష్టం చేశారు. తపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తన ఫోన్ ట్యాప్ (Phone tap) అవుతున్నట్టు అనుమానం ఉందని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఒక్కొక్క బిల్లును సమగ్రంగా పరిశీలిస్తున్నానని, కానీ ఈ లోపే తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు. బుధవారం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ రిక్రూట్‌మెంట్ బిల్లుపై ప్రభుత్వాన్ని క్లారిఫికేషన్ కోరానని, కానీ రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకుంటున్నట్లుగా ప్రచారం జరిగిందని తెలిపారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధన్యత ఇచ్చానని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్నల వర్షం
ప్రభుత్వంపై గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డు (Recruitment Board) ఎందుకు అన్నదే నా ప్రశ్న?.. 8 ఏళ్లుగా అనేక వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని యూనివర్సిటీల వీసీలతో మాట్లాడాను. ఆ తర్వాత డీటైల్డ్ రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి పంపా. కొత్త రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి?.. యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా?.. లీగల్‌గా ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి... మళ్లీ నియమాకాలు ఉంటాయా?.. బోర్డు ఏర్పాటులో ఎలాంటి ప్రోటోకాల్ పాటిస్తారు?.. మంత్రి సమాచారం రాలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్‌భవన్.. ప్రగతి భవన్ కాదు. విద్యార్థులు ఎవరైనా నేరుగా రాజ్‌భవన్ రావచ్చు’’ అని తమిళిసై ప్రకటించారు.
గవర్నర్ వర్సెస్ సర్కారు
ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు. నిజానికి, ఆ లేఖను తొలుత విద్యా శాఖకు రాశారని ప్రచారం జరిగింది.