Telangana DGP: కొత్త డీజీపీపై ఉత్కంఠ!
ABN , First Publish Date - 2022-12-27T19:33:28+05:30 IST
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో తరవాత డీజీపీ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Director General of Police Telangana M Mahender Reddy) పదవి కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో తరవాత డీజీపీ(DGP) ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. డీజీపీ రేసులో పలువురు సీనియర్ ఐపిఎస్(IPS) అధికారులున్నా నియామకం ఆలస్యమయ్యేలా ఉంది. దీనిపై విషయంలో ఎటువంటి ప్రకటనా ఇంకా వెలువడకపోవడంతో కొత్త డీజీపీ నియమించే వరకు ఇంఛార్జి డీజీపీని నియమించే అవకాశాలున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా ఇదే సమాచారం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఇంఛార్జ్ డీజీపీ రేసులో ఉన్నవారు
1. అంజన్ కుమార్
2. జితేందర్
3. రవి గుప్తా
1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ (Anjani Kumar) ప్రస్తుతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో కొన్ని వారాల పాటు మెడికల్ లీవ్ పెట్టినప్పుడు అంజనీ కుమార్ ఇంఛార్జ్ డీజీపీగా పనిచేశారు కూడా.
జితేందర్ (Jitender) గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీగా పని చేశారు. ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీగా పని చేస్తున్నారు.
1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా (Ravi Gupta) పేరు కూడా డీజీపీ రేసులో వినపడుతోంది. గతంలో ఆయన డీఐజీ, ఐజీగా పనిచేశారు. ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీలో విశేషమైన అనుభవం కూడా ఆయనకుంది.
వీరు కాకుండా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేరు కూడా వినపడుతోంది. ఆనంద్ ప్రస్తుతం సీనియర్ అడిషనల్ డీజీపీ ర్యాంక్‌లో ఉన్నారు.