Minister Mallareddy: మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ ఫోకస్.. మల్లారెడ్డి కోడలు, కూతురిని బ్యాంక్‌కి తీసుకొచ్చిన అధికారులు
ABN , First Publish Date - 2022-11-23T17:33:01+05:30 IST
మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తులపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకొచ్చారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్ (Locker)ను అధికారులు ఓపెన్ చేయించారు.
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆస్తులపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంక్‌కు తీసుకొచ్చారు. బాలానగర్ క్రాంతి బ్యాంక్‌లో లాకర్ (Locker)ను అధికారులు ఓపెన్ చేయించారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, సంస్థలపై ఐటీ అధికారులు మెరుపుదాడులు చేశారు. మల్లారెడ్డి కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)తోపాటు సోదరులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏకంగా 50 బృందాలుగా విడిపోయి మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు ఈ తనిఖీల్లో వేర్వేరు చోట్ల దాదాపు రూ.4 కోట్ల నగదును, ఐటీ రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన సీడీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఐటీ సోదాలపై టీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించడంపై టీఆర్‌ఎస్ శ్రేణులు, ఆయన మద్దతుదారులు భగ్గుమన్నారు. మంగళవారం సాయంత్రం వారు మల్లారెడ్డి ఇంటి వద్దకు చేరుకొని ఐటీ అధికారులకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లారెడ్డిని తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు యత్నించారు.