Rajanna sirisilla: వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-11-14T07:42:43+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామి(Vemulawada Rajarajeswara Swamy) వారి పుణ్యక్షేత్రానికి సోమవారం తెల్లవారుజామునుంచే భక్తులు
Rajanna sirisilla: వేములవాడ రాజరాజేశ్వరస్వామి(Vemulawada Rajarajeswara Swamy) వారి పుణ్యక్షేత్రానికి సోమవారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రాజన్న దర్శనానికి భక్తులు క్యూలైన్ లో బారులు తీరారు. వేములవాడ రాజన్న దర్శనానికి సుమారుగా 6 గంటల సమయం పట్టనుంది. ఆలయ ముందు భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
కాగా, ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న సన్నిధికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. దీంతో శీఘ్రదర్శనం, ధర్మదర్శనం, అభిషేక క్యూలైన్‌లో భక్తులు గంటల తరబడి వేచి పార్వతిపరమేశ్వరులను దర్శించుకున్నారు. శ్రీస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు కల్యాణం, కుంకుమార్చన, అభిషేకం వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సుమారు 25 వేల మంది భక్తులు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నట్లు, రూ.18 లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు అంచనా వేశారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆదివారం రాత్రి పెద్ద సంఖ్యలో రాజన్న ఆలయానికి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున్న ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
రాజన్న ఆలయ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఏటా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్న 2023 క్యాలెండరును ఆదివారం రాజన్న ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. మొదట రాజన్న ఆలయ స్థానచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాజన్న ఆలయం ఫొటోలతో ఏర్పాటు చేసిన క్యాలెండర్ ప్రచార శాఖలో రూ.90కి భక్తులకు అదుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో ప్రతాప నవీన్, పర్యవేక్షకులు తిరుపతిరావు తదితరులు ఉన్నారు.