హ్యాపీహ్యాపీగా..

ABN , First Publish Date - 2022-12-31T22:49:32+05:30 IST

కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. జనం 2022 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి, 2023 సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి.

హ్యాపీహ్యాపీగా..
మహబూబ్‌నగర్‌లోని ఓ కళాశాలలో న్యూ ఇయర్‌ జోష్‌లో విద్యార్థినులు; కేక్‌ తీసుకెళ్తున్న యువతులు

2022కు గుడ్‌బై.. 2023కు ఘన స్వాగతం

జిల్లా వ్యాప్తంగా నయా జోష్‌

రూ.కోట్లలో మద్యం విక్రయాలు.. బార్‌లు, దాబాలు కిటకిట

హోటళ్ళు, బేకరీలు హౌస్‌ ఫుల్‌

పాలమూరు పురవీధుల్లో కేక్‌ల కొనుగోలుకు ఎగబడ్డ జనం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 31: కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. జనం 2022 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి, 2023 సంవత్సరానికి కోటి ఆశలతో స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి న్యూఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల పట్టణాల్లో బేకరీలు, స్వీట్‌హౌస్‌లను విద్యుద్దీపాలతో అలంకరించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, పిల్లలు నూతన సంవత్సర వేడుకలను సందడిగా జరుపుకున్నారు. పలు వ్యాపార సంస్థలు జనంతో రద్దీగా మారాయి. శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ పట్టణ ప్రధాన రహదారులు సందడిగా మారాయి. సాయంత్రం ఆరు గంటల నుంచే డిసెంబర్‌ 31 విందులో జనం మునిగిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకంక్షలు చెప్పుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

కేక్‌ల కోసం పోటాపోటీ

జిల్లా వ్యాప్తంగా ఉన్న బేకరీలు కేక్‌లతో నిండిపోయాయి. కేక్‌లకు ముందుగానే జనం అధిక సంఖ్యలో ఆర్డర్‌లు చేశారు. మరోవైపు వేల సంఖ్యలో కేక్‌లను ప్రధాన పట్టణాల రహదారుల అంచున ఉంచి విక్రయించారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, భూత్పూర్‌, దేవరకద్రలోనూ రోడ్లపై కేక్‌లను విక్రయించారు. మహబూబ్‌నగర్‌లోని మోడ్రన్‌ బేకరీలు, కాస్మిక్‌, పిస్తాహౌస్‌, సిమ్‌కో, ఫైవ్‌స్టార్‌ బేకరీల వద్ద జనం బారులు తీరడంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. కేక్‌ల కొనుగోళ్లకు వ్యాపారు లు ధరలు తగ్గించి ఆఫర్లు ప్రకటించారు. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లలోనూ మ్యూజిక్‌లు పెట్టుకుని నృత్యాలు చేశారు.

మద్యం దుకాణాలు కిటకిట

న్యూఇయర్‌ అంటేనే మందు బాబులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. డిసెంబర్‌ 31కి గుడ్‌బై చెబుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మద్యం పార్టీలు చేసుకుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డిసెంబర్‌ 31 ఒక్క రోజే రూ.40-50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతుండటంతో వ్యాపారులు మూడు నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున మద్యం స్టాక్‌ తెచ్చిపెట్టుకున్నారు. అందుకనుగుణంగా విక్రయాలు జరిగాయి. మద్యంతోపాటు వాటిలోకి మంచింగ్‌ కోసం మటన్‌, చికెన్‌ కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్ళు చేయడంతో వాటి వ్యాపారం కూడా జోరందుకుంది. మరికొందరు హాటళ్ళలో బిర్యాని, స్టాటర్స్‌ ఆర్డర్‌ చేసి తీసుకెళ్లారు. కొందరు బిర్యానీలపై కూల్‌డ్రింక్స్‌ ఆఫర్‌లు ఇచ్చారు.

పోలీసుల భారీ బందోబస్తు

న్యూఇయర్‌ వేడుకలకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందుగానే ఆంక్షలు విధించారు. తాగి వాహనాలు నడుపొద్దని, పట్టుబడితే వాహనాలు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. దాంతో చాలామంది తాగి రోడ్లపైకి రాలేదు. సాయంత్రం ఆరు గంటల నుంచే డ్రంకెన్‌ తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల, జాతీయ రహదారులు, అన్ని మండల కేంరద్రాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు బందోబస్తును పర్యవేక్షించారు. పురవీధుల్లో అదనంగా పెట్రోలింగ్‌ బృందాలను పెంచారు.

Updated Date - 2022-12-31T22:49:34+05:30 IST