విద్యార్థులకు చదవడం రాకపోతే ఎలా?

ABN , First Publish Date - 2022-08-20T04:51:38+05:30 IST

‘అడ్మిషన్‌ కోసం వస్తే పట్టించుకోని ఉపాధ్యాయులు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి డీఈవో స్పందించారు.

విద్యార్థులకు చదవడం రాకపోతే ఎలా?
నంచర్ల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో పాఠం చదివిస్తున్న డీఈవో రవీందర్‌

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

- ఉపాధ్యాయుల తీరుపై డీఈవో గరం గరం 


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం ఆగస్టు 19: ‘అడ్మిషన్‌ కోసం వస్తే పట్టించుకోని ఉపాధ్యాయులు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి డీఈవో స్పందించారు. శుక్రవారం మహమ్మదాబాద్‌ మండలంలోని నంచర్ల ప్రాథమిక పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల బోధనా తీరుపై మండిపడ్డారు. ఐదో తరగతికి వెళ్లి తెలుగు పాఠం చదవమని 20 మంది విద్యార్థులను అడిగితే అందులో కనీసం ఇద్దరు మాత్రమే చదవడంపై బోధనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు తగాదాలు పెట్టుకుంటే విద్యార్థులకు చదువు ఎలా చెపుతారని మండిపడ్డారు. ఉపాధ్యాయులు నెలరోజుల్లో పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పక్కనే ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించి, పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టి, ఉపాధ్యాయుల బోధనా తీరును ప్రశంసించారు. అదేవిధంగా, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని పరిశీలించి, అక్కడున్న పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-20T04:51:38+05:30 IST