21 మండలాలు.. ముగ్గురు ఎంఈవోలు
ABN , First Publish Date - 2022-09-12T04:32:17+05:30 IST
మెదక్ జిల్లాలో 21 మండలాలకు కేవలం ముగ్గురు ఎంఈవోలనే కొనసాగిస్తుండడంతో స్కూళ్ల పర్యవేక్షణ కొరవడింది. మండలానికి ఒక్క ఎంఈవో ఉండాల్సి ఉండగా.. 21 మండలాలకు కలిపి ముగ్గురే కొనసాగుతున్నారు.
ఒక్కొక్కరికి ఇన్‌చార్జిగా ఏడు మండలాల బాధ్యతలు
మెదక్ జిల్లాలోని పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ
శివ్వంపేట, సెప్టెంబరు 11: విద్యావ్యవస్థ బలోపేతానికి పాటుపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా... ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. పాఠశాలల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారుల పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేయడమే అందుకు నిదర్శనం. ఎంఈవోల పోస్టులను భర్తీ చేయకుండా సంవత్సరాల తరబడి ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తుండడంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గత కొన్నేళ్లుగా మెదక్ జిల్లాలో 21 మండలాలకు కేవలం ముగ్గురు ఎంఈవోలనే కొనసాగిస్తుండడంతో స్కూళ్ల పర్యవేక్షణ కొరవడింది. మండలానికి ఒక్క ఎంఈవో ఉండాల్సి ఉండగా.. 21 మండలాలకు కలిపి ముగ్గురే కొనసాగుతున్నారు. ఆ ముగ్గురిలో ఒక్కో ఎంఈవో ఏడు మండలాలకు ఇన్‌చార్జిగా ఉండాల్సిన దుస్థితి. దీంతో ఇన్‌చార్జి ఎంఈవోలు ఎప్పుడు ఎక్కడో ఉంటారో కూడా తెలియని పరిస్థితి. స్కూళ్లలో ఉపాధ్యాయులపై సరైన పర్యవేక్షణ లేక సమయ పాలన కూడా పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శివ్వంపేట ఇన్‌చార్జి ఎంఈవో బుచ్యానాయక్‌కు శివ్వంపేటతో పాటు నర్సాపూర్, చేగుంట, కౌడిపల్లి, రేగోడ్, శంకరంపేట, అల్లాదుర్గం, చిలిపిచెడ్, నార్సింగి మండలాలకు ఇన్‌చార్జి ఉన్నారు. మెదక్ ఇన్‌చార్జి ఎంఈవో నీలకంఠంకు మెదక్, హవేలిఘనపూర్, రామాయంపేట, నిజాంపేట, కొల్చారం, పాపన్నపేట, టెక్మాల్ మండలాలున్నాయి. వెల్దుర్తి, శంకరంపేట, మాసాయిపేట, తూప్రాన్, మనోరాబాద్ మండలాలకు ఎంఈవో యాదగిరి ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో ఉన్న ముగ్గురికి పనిభారం పెరిగి పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడంలో సఫలం కాలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా కామన్ సర్వీసు రూల్‌కోర్టు పెండింగ్‌లో ఉన్నందున ఎంఈవోల పదోన్నతులు భర్తీ కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయమై ఆలోచించి ఎంఈవో పోస్టులను వెంటనేభర్తీ చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.