సంగారెడ్డి కలెక్టరేట్‌లో పాముల కలకలం
ABN , First Publish Date - 2022-10-13T05:07:36+05:30 IST
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పాములు విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. పాముల వల్ల కలెక్టరేట్ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.
భయాందోళనలో ఉద్యోగులు
బిక్కుబిక్కుమంటూ విధులకు హాజరు
సంగారెడ్డిఅర్బన్/సంగారెడ్డిటౌన్, అక్టోబరు 12: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పాములు విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. పాముల వల్ల కలెక్టరేట్ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ, డీపీఆర్‌వో, ఐసీడీఎస్, మెప్మా, ఆరోగ్యశ్రీశాఖల కార్యాలయాల్లో పాములు సంచరించడం కలకలం రేపుతున్నది. కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ పిచ్చిమొక్కలు విచ్చలవిడిగా పెరగడంతో పాములు సంచరిస్తున్నా పరిశుభ్రతా చర్యలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలున్నాయి. ఇటీవల డీఆర్‌డీఏలోని పెన్షన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగిని పాము కాటు వేయడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక రెండు రోజుల క్రితం డీపీఆర్‌వో కార్యాలయంలో పాము కలకలం సృష్టించడంతో సిబ్బంది పామును చంపేశారు. తాజాగా బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయం తలుపుల వద్ద పాము సంచరిస్తుండటంతో అప్రమత్తమైన సిబ్బంది కర్రలతో ఆ పామును చంపేశారు. కలెక్టరేట్ ఆవరణలో పరిశుభ్రతను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు.