డంపింగ్‌యార్డు ఉన్నా.. చెత్తంతా ఆరుబయటే
ABN , First Publish Date - 2022-11-15T00:38:40+05:30 IST
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ కందిలో చెత్త సమస్య కొలిక్కి రావడం లేదు.
కందిలో కొలిక్కిరాని చెత్త సమస్య
చెత్తను తగలబెట్టి పూడ్చేస్తున్న వైనం
పట్టించుకోని ఉన్నతాధికారులు
కంది, నవంబరు 14: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ కందిలో చెత్త సమస్య కొలిక్కి రావడం లేదు. ఓ పక్క హోటళ్లు, మరోపక్క దాబాలు, ఫంక్షన్‌హాళ్ల చెత్త, గ్రామంలో సేకరించిన చెత్తతో రోజు పెద్దకుప్పలా తయారవుతుంది. దీన్ని డంపింగ్‌యార్డులో కాకుండా పక్కనే బహిరంగ ప్రదేశంలో పారబోస్తున్నారు. చెత్తను వేరు చేసి ఆదాయం సమకూర్చడంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు 8 వేల మంది నివసిస్తున్న గ్రామంలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తడి, పొడి చెత్తను వేరు చేయకుండా, మొత్తం కుప్పగా పోసి కాల్చేస్తున్నారు. సోమవారం నాలుగు ఎక్స్‌కవేటర్లను ఐదు ట్రాక్టర్లతో డబుల్ బెడ్ రూం ఇళ్ల పక్కనే ఓ గుంతలో నుంచి మట్టిని నింపి చెత్తను పూడ్చివేశారు. చెత్తను దాచిపెట్టడానికి మట్టితో భూగర్భంలో కలిపేసే ప్రయత్నం చేస్తున్నారని, చుట్టపక్కల ఉన్న తమ పొలాలు కలుషితమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి డంపింగ్‌యార్డును నిర్మించారని, కానీ చెత్తను బయట పారబోసి భూగర్భంలో పూడ్చడమేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.