జైలు గోడల్లోంచి.. అంగట్లోకొచ్చి..

ABN , First Publish Date - 2022-12-03T23:46:17+05:30 IST

ఓ నలుగురు ఖైదీలు జైలు గోడలు దాటి బయటకొచ్చారు. వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో (క్రేట్స్‌) నవనవలాడే కూరగాయలతో నేరుగా అంగట్లోకి వెళ్లారు.

జైలు గోడల్లోంచి.. అంగట్లోకొచ్చి..

సంగారెడ్డి సంతకు కూరగాయలతో నలుగురు ఖైదీలు

జైలు ఆవరణలో కాసినవే.. వార్డర్‌ పర్యవేక్షణలో విక్రయం

సంగారెడ్డి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఓ నలుగురు ఖైదీలు జైలు గోడలు దాటి బయటకొచ్చారు. వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్‌ డబ్బాల్లో (క్రేట్స్‌) నవనవలాడే కూరగాయలతో నేరుగా అంగట్లోకి వెళ్లారు. అక్కడ రైతులతో కలిసి రకరకాల ఆకుకూరలు, వంకాయలు, టమాటలను విక్రయించారు! ఈ ఫొటోలో ఆకుపచ్చ రంగు దుస్తుల్లో కనిపిస్తోంది సంగారెడ్డి జిల్లా కేంద్రం జైల్లో వివిధ కేసుల్లో ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు! వీరు కూరగాయలను విక్రయిస్తున్న చోటు సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ సంత!! శనివారం జరిగిన అంగట్లో జైలు వార్డర్‌ పర్యవేక్షణలో ఈ ఖైదీలు కూరగాయలమ్మారు. కంది సమీపంలోనే సంగారెడ్డి ఓపెన్‌ జైలు ఉంది. ఈ జైలు ఆవరణలో వివిధ రకాల కూరగాయలను ఖైదీలే పండిస్తారు. మామిడి తోటనూ నిర్వహిస్తారు. ఇక్కడే జైలు ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోలు బంక్‌లోనూ ఖైదీలు పనిచేస్తుంటారు. అయితే జైలు ఆవరణలో పండే కూరగాయలను ఖైదీల కోసం వినియోగించే వంటకాల కోసం వాడుతుంటారు. ఇలా జైల్లోంచి ఖైదీలు సంతకు రావడం.. కూరగాయలు విక్రయించడం గతంలో జరగలేదు. దీనిపైనే జైలు సూపరింటెండెంట్‌ భరత్‌రెడ్డిని ప్రశ్నించగా జైలుకు ఆదాయం సమకూర్చేందుకే ఖైదీలతో కూరగాయలు అమ్మిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-03T23:46:21+05:30 IST