ఉపాధ్యాయ వృత్తి గురుతరమైన బాధ్యత

ABN , First Publish Date - 2022-09-06T04:48:46+05:30 IST

ఉపాధ్యాయ వృత్తి గురుతరమైన బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తిలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు.

ఉపాధ్యాయ వృత్తి గురుతరమైన బాధ్యత
వెల్దుర్తిలో ఉపాధ్యాయులను సన్మానిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌నర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

పలు మండలాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

వెల్దుర్తి/మెదక్‌ అర్బన్‌/అల్లాదుర్గం/చేగుంట/హవేళీఘణపూర్‌/చిన్నశంకరంపేట/మాసాయిపేట, సెప్టెంబరు 5: ఉపాధ్యాయ వృత్తి గురుతరమైన బాధ్యత అని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తిలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 21 మంది ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమాజంలో గురువుల ప్రాముఖ్యత ఎంతో గొప్పదని, మనందరం ఈ స్థానంలో ఉన్నామంటే గురువుల వల్లే అని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి తల్లి, తండ్రి తర్వాత మూడో దైవం గురువేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌, ఎంపీపీ స్వరూపరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, ఎంఈవో యాదగిరి, సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంటుందని సిద్ధార్థ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ శ్రీనివాస్‌ చౌదరి పేర్కొన్నారు. సోమవారం మెదక్‌లోని సిద్ధార్థ్‌ ఉన్నత పాఠశాలలో సర్వేపలి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. అలాగే మండలంలోని మంబోజిపల్లి గీతా హైస్కూల్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి గీతా విద్యాసంస్థల అధినేత రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అల్లాదుర్గంలోని ఆయా పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చేగుంట మండలంలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూలమాలలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. హవేళీఘణపూర్‌: సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు జంగరాయి, చందంపేట, గవ్వలపల్లి, శాలిపేట తదితర గ్రామాల్లో సర్పంచులు జ్యోతిప్రభాకర్‌, మంగయాదవరావు, పోచయ్య, శ్రీలత ఉపాధ్యాయులు, అధికారులు రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాసాయిపేట: మాసాయిపేట మండలంలోని కొప్పులపల్లి, బొమ్మారం, చెట్ల తిమ్మాయిపల్లి, పోతన్‌పల్లి, మాసాయిపేట పాఠశాలల్లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి  ఉపాధ్యాయులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. 

సంగారెడ్డి జిల్లాలో

నారాయణఖేడ్‌/సంగారెడ్డి అర్బన్‌/జిన్నారం/హత్నూర,  సెప్టెంబరు 5: సమాజం నిర్మించడంలో గురువుల పాత్ర కీలకమని, గురువులే సమాజ నిర్మాతలని ఖేడ్‌ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ చౌహాన్‌ మండలంలోని 50 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సొంత ఖర్చులతో మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌ సెయింట్‌ ఆంథోనీస్‌ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిలో భాగంగా ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ అరుణారెడ్డి, అకాడమిక్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే సంగారెడ్డిలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్‌ఆర్‌ డెవలపర్స్‌ అధినేత పులిమామిడి రాజు ఆధ్వర్యంలో కళాశాలలోని లెక్చరర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, సాయిబాషా, హనుమంతు పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం 12వ వార్డు కౌన్సిలర్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో గురుపూజోత్సవం నిర్వహించి ప్రిన్సిపాల్‌, అధ్యాపకులను పులిమామిడి రాజు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందజేశారు. జిన్నారం మండలం బొల్లారం మోడల్‌ పాఠశాలలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి ఉపాధ్యాయులను సన్మానించారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గురుపూజ దినోత్సవంలో పాల్గొన్నారు. బొల్లారం ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం మంగీలాల్‌కు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందజేశారు. మండల కేంద్రమైన హత్నూర గురుకుల జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిలో హత్నూర సర్పంచ్‌ వీరస్వామిగౌడ్‌ పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా మండలంలోని చందాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను గమ్యం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. గుండ్లమాచునూర్‌ మోడల్‌ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు మొక్కలు నాటారు. అలాగే ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 



Updated Date - 2022-09-06T04:48:46+05:30 IST