గ్యాస్ లీకై చెలరేగిన మంటలు ..ఇల్లు దగ్ధం
ABN , First Publish Date - 2022-12-02T00:11:10+05:30 IST
ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండరు లీకేజి కావడంతో మంటలు చెలరేగి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది.
రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం
చిన్నకోడూరు, డిసెంబరు 1 : ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండరు లీకేజి కావడంతో మంటలు చెలరేగి ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని మల్లారం గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ శివానందం, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కేతిరెడ్డి సతీ్‌షకుమార్, సోదరుడు దేవేందర్, తల్లి లక్ష్మి, నాన్నమ్మ రాజవ్వతో కలిసి ఒకే ఒంట్లో ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఇంట్లోని ఓ గదిలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండరు లీకైన శబ్ధం వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సతీ్‌షకుమార్ భార్య జ్యోతి, కూతురు బయటకు పరుగులు తీశారు. ఇంతలోనే సిలిండరు పేలి ఇంట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. కుటుంబసభ్యులు, స్థానికుల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఎస్‌ఐ శివానందం సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కాసేపటికి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా గంట తర్వాత అదుపులోకి వచ్చాయి. ఇంట్లో ఉన్న రూ.80 వేల నగదు, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లింది. సతీ్‌షకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.