‘మన ఊరు- మన బడి’ పనులు 5లోగా పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2022-12-29T23:07:49+05:30 IST

సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌

‘మన ఊరు- మన బడి’ పనులు 5లోగా పూర్తవ్వాలి
బిడెకన్నె గ్రామంలో పంటలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

సంగారెడ్డి రూరల్‌, డిసెంబరు 29: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మన ఊరు-మన బడి పనులు జనవరి 5లోగా పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను సంగారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. సంగారెడ్డిలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషాతో కలిసి అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. పనులు పూర్తయిన వెంటనే ఎస్‌టీవోలను జనరేట్‌ చేయాలన్నారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ కింద ఎవరు మొదట ఎస్‌టీవోలను నమోదు చేస్తే వారికి ముందుగా నిధులు విడుదల అవుతాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వం నిధులిస్తున్నా పనులు త్వరితగతిన చేయకపోవడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఈవో రాజేష్‌ పాల్గొన్నారు.

సేంద్రియ పద్ధతిలో పంటల సాగు బాగు

ఝరాసంగం: సేంద్రియ పద్ధతిలో పంటలను, పండ్ల తోటలను పెంచడం ఎంతో సంతోషకరమైన విషయమని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. గురువారం బిడెకన్నె గ్రామ శివారులో అరణ్య ఫార్మాకల్చర్‌ క్షేత్రాన్ని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషాతో కలిసి సందర్శించారు. క్షేత్రంలో సాగవుతన్న పంటలపై ఆ సంస్థ ప్రతినిధి పద్మను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి నర్సింగ్‌రావు, ఏడిఏ భిక్షపతి, మండల వ్యవసాయ అధికారి వెంకటేషం, డిప్యూటీ తహసీల్దార్‌ రాజిరెడ్డి, ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2022-12-29T23:07:50+05:30 IST