మా భూములను వదులుకోబోం
ABN , First Publish Date - 2022-10-23T00:01:17+05:30 IST
నంగునూరు, అక్టోబరు 22: ఇందిరమ్మ కాలంలో దళితులకు కేటాయించిన భూమిని తాము వదులుకోబోమని నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో దళితులు శనివారం ఆందోళనకు దిగారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట కోనాయిపల్లి గ్రామస్థుల ఆందోళన
నంగునూరు, అక్టోబరు 22: ఇందిరమ్మ కాలంలో దళితులకు కేటాయించిన భూమిని తాము వదులుకోబోమని నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో దళితులు శనివారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. తమకు కేటాయించిన భూమిని గ్రామ అవసరాల కోసం వాడుకుంటున్నారని దళితులు ఆరోపించారు. అట్టి భూమిలో ఇళ్లు కట్టుకునేలా అధికారులు వచ్చి హామీఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని సర్వే నంబరు 8ఆలో 1975 సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట 5 ఎకరాల 4 గుంటల భూమి దళితులకు పంపిణీ చేసిందన్నారు. అప్పట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక తాము ఇళ్లు కట్టుకోలేదని, గ్రామస్థుల విజ్ఞప్తుల మేరకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పల్లె ప్రకృతివనం, ఓపెన్ జిమ్ కోసం కొంత భూమిని ఇచ్చామన్నారు. మిగతా భూమిలో రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అట్టి భూమిలో శాశ్వత కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ దిలీ్‌పనాయక్ అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. సదరు సర్వే నంబరు ప్రభుత్వ భూమిగా రికార్డులో నమోదైందన్నారు. ఎలాంటి ఆందోళనలు చేయొద్దని, ధర్నా విరమించాలని సూచించారు. దళితుల కేటాయించిన భూమి తాము వదులుకోబోమంటూ గ్రామస్థులు తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇళ్లు కట్టునేలా హామీఇచ్చే వరకు ధర్నా చేపడుతామని తెలిపారు.