పురుగు పట్టి..గడ్డ కట్టి
ABN , First Publish Date - 2022-10-20T05:06:21+05:30 IST
జిల్లాలో బియ్యం అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. పూర్తిస్థాయిలో ఈ దందాను నియంత్రించకున్నా అధికారులు అప్పుడోఇప్పుడో అక్రమ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అయితే సీజ్ చేసిన ఈ రేషన్ బియ్యం స్టాక్ పాయింట్‌లో నిల్వ చేయగా అక్కడ ముక్కిపోతున్నా పట్టించుకోవడం లేదు.
పక్కదారి పట్టిన రేషన్ బియ్యం అధోగతి
స్టాక్ పాయింట్‌లో పందికొక్కుల పాలు
నెలల తరబడిగా ఎంఎల్‌ఎస్ గోదాముల్లో నిల్వ
బియ్యానికి బూజు..రంగుమారుతున్న వైనం
వేలం వేయకపోవడంతో అధ్వాన స్థితికి
ఒక్క ఏడాదిలోనే 4,500 క్వింటాళ్లు పట్టివేత
పేద ప్రజల రేషన్ పక్కదారి పడుతున్నది. నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. జిల్లా నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడినప్పుడు సీజ్ చేసి స్టాక్ పాయింట్లకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు. బియ్యాన్ని వేలం వేయడంలో జాప్యం నెలకొనడంతో పురుగులు పట్టి, గడ్డలు కట్టి పందికొక్కుల పాలవుతున్నాయి.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 19 : జిల్లాలో బియ్యం అక్రమాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. పూర్తిస్థాయిలో ఈ దందాను నియంత్రించకున్నా అధికారులు అప్పుడోఇప్పుడో అక్రమ బియ్యాన్ని పట్టుకుంటున్నారు. అయితే సీజ్ చేసిన ఈ రేషన్ బియ్యం స్టాక్ పాయింట్‌లో నిల్వ చేయగా అక్కడ ముక్కిపోతున్నా పట్టించుకోవడం లేదు.
రేషన్ బియ్యంతో వ్యాపారం
జిల్లాలో 684 రేషన్ దుకాణాల పరిధిలో 2,93,022 కుటుంబాలకు ప్రతీనెల బియ్యం పంపిణీ చేస్తున్నారు. సదరు కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 6 కిలోల బియ్యం కిలో రూపాయి చొప్పున అందుతున్నది. కొవిడ్, ఇతర విపత్తుల సందర్భాల్లో ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున ఉచితంగా ఇచాలరు. ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా చాలా కుటుంబాలు రేషన్ బియ్యంతో వంట చేసుకోవడానికి అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. కొందరు ఈ బియ్యాన్ని కేవలం పిండివంటలకే పరిమితం చేస్తున్నారు. రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకునేవారి సంఖ్య కూడా తగ్గుతోంది. ఇలా వెళ్లనివారి వివరాలను రేషన్ డీలర్లు తీసుకొని వారి పేరిట వచ్చిన బియ్యాన్ని ఓటీపీ నంబరు సహాయంతో తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అవసరమైతే కిలోకు రూ.5చొప్పున కార్డుదారులకు చెల్లించి రూ.8కి దళారులకు విక్రయుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దళారులు ఓ అడుగు ముందుకేసి ఇంటింటా తిరిగి రేషన్ బియ్యం కొనుగోలు చేసి రూ.10నుంచి రూ.15 చొప్పున అమ్ముకుంటున్నారు.
స్థానికంగా దళారులు సేకరించిన రేషన్ బియ్యాన్ని మెజార్టీ శాతం పౌల్ర్టీలకు తరలిస్తున్నారు. కోళ్లకు దాణాగా మొక్కజొన్నతోపాటు ఈ బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అందుకే పట్టుబడిన బియ్యంలో సగం వరకు పౌల్ర్టీలలో లభించినవే కావడం గమనార్హం. ఇక బడా దళారులు మరో అడుగు ముందుకేసి లారీలు, డీసీఎం వ్యాన్లలో రేషన్ బియ్యాన్ని రాష్ట్రం దాటించేస్తున్నారు. మహారాష్ట్రలో ఈ బియ్యానికి డిమాండ్ ఉండడంతో అడ్డదారుల్లో రవాణా చేస్తున్నారు. అంతేగాకుండా హైదరాబాద్‌కు కూడా ఆటోట్రాలీల ద్వారా చేరవేస్తున్నారు. ఇదే రేషన్ బియ్యాన్ని ప్రత్యేక యంత్రాల ద్వారా రీసైక్లింగ్ చేసి సన్నబియ్యంగా సైతం మారుస్తున్నారు. కిలోకు రూ.35 నుంచి రూ.40 చొప్పున విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన ఏడాదికాలంలోనే 4,500 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యం పట్టుబడడం విస్మయాన్ని కలిగిస్తోంది.
పట్టుకున్న బియ్యానికి పురుగులు
అడ్డదారుల్లో రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని సదరు నిందితులపై కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉంది. అయితే సీజ్ చేసిన బియ్యాన్ని మండల స్థాయిలో ఉన్న స్టాక్ పాయింట్లలో నిల్వ చేశారు. ఈ బియ్యంపై విచారణ పూర్తయ్యాక వేలం వేయాల్సి ఉంటుంది. అయితే వేలం వేయడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఎంఎల్‌ఎస్ గోదాముల్లో ఉన్న బియ్యం పూర్తిగా అదోగతి పాలవుతున్నాయి. అధ్వానంగా మారి వంటకు పనికిరాకుండా పోతున్నాయి. పలు గోదాముల్లో ఉన్న క్వింటాళ్ల కొద్ది బియ్యానికి పురుగులు పట్టి గడ్డలు కట్టాయి. రంగు కూడా మారాయి. ఇంకొన్ని చోట్ల ఎలుకలు, పందికొక్కులకు ఆహారంగా మారుతున్నాయి. మంచి ఉద్దేశంతో పట్టుకున్న ఈ బియ్యం చివరకు ఇటు పేదలకు అందక, అటు కోళ్లకు చెందక ఉన్నచోటనే నాసిరకంగా మారుతున్నాయి. దీనిపై జిల్లా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
