గోదాముల అద్దె ఏదీ?

ABN , First Publish Date - 2022-11-23T00:11:06+05:30 IST

ఎన్నికల సమయంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ గోదాములను అద్దెకు తీసుకున్న అధికారులు నేటికీ వాటిని చెల్లించలేదు. సాధారణ ఎన్నికలు పూర్తయి నాలుగేళ్లు కావొస్తుండగా, ఆరు గోదాములకు సంబంధించిన అద్దె రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోగా అవి నేటికీ అధికారుల ఆధీనంలో ఉన్నాయి.

గోదాముల అద్దె ఏదీ?
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో గోదాములు

ఎన్నికల అవసరాలకు మార్కెట్‌ గోదాముల వినియోగం

నాలుగేళ్లలో రూ.కోటి దాటిన అద్దె బకాయి

బకాయిల చెల్లింపునకు కలగని మోక్షం

సూర్యాపేట సిటీ, నవంబరు 22: ఎన్నికల సమయంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ గోదాములను అద్దెకు తీసుకున్న అధికారులు నేటికీ వాటిని చెల్లించలేదు. సాధారణ ఎన్నికలు పూర్తయి నాలుగేళ్లు కావొస్తుండగా, ఆరు గోదాములకు సంబంధించిన అద్దె రూ.1.11కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోగా అవి నేటికీ అధికారుల ఆధీనంలో ఉన్నాయి. ఫలితంగా మార్కెట్‌కు ఆదాయం రాకపోగా, రైతులు వారి దిగుబడులను నిల్వ చేసే అవకాశం లేకుండాపోయింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో రైతుల కోసం నిర్మించిన ఆరు గోదాములను 2018 సాధారణ ఎన్నికల కోసం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ ఆయన ఆధీనంలో తీసుకున్నారు. ఈ గోదాముల్లో ఎన్నికలకు సంబంధించిన వీవీ ఫ్యాడ్లు, ఈవీఎంలను భద్రపరిచారు. అందుకు గాను వ్యవసాయ మార్కెట్‌కు 2018, నవంబరు 10 నుంచి ఈ ఏడాది నవంబరు 21 వరకు (నాలుగేళ్ల 11 రోజులకు) రూ.1,11,81,600లు అద్దె చెల్లించాల్సి ఉంది.

ఏళ్లుగా ఎదురుచూపులు

సాధారణ ఎన్నికల నిర్వహణకు వీవీ ఫ్యాడ్లు, ఈవీఎంలను భద్రపర్చడంతో పాటు కౌంటింగ్‌ కోసం వ్యవసాయ మార్కెట్‌లోని ఆరు గోదాములను కలెక్టర్‌ 2018, నవంబరు 10న స్వాధీనం చేసుకున్నారు. 5వేల మెట్రిక్‌ సామర్థ్యం కలిగిన గోదాములో ఏ, బీ, సీ-బ్లాక్‌లకు నెలకు రూ.1,19,045 అద్దెగా నిర్ణయించారు. 48 నెలల కాలానికి రూ.57,17,160 అద్దె చెల్లించాల్సి ఉంది. మరో 5వేల మెట్రిక్‌ సామర్థ్యం కలిగిన గోదాములో ఏ, సీ-బ్లాక్‌లకు నెలకు రూ.81,113 అద్దెగా నిర్ణయించారు. ఈ గోదాముకు మొత్తం రూ.38,93,424 చెల్లించాల్సి ఉంది. 600 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గోదాములకు నెలకు రూ.8,205 అద్దె కాగా, మొత్తం రూ.7,87,680 చెల్లించాల్సి ఉంది. 600మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన మరో రెండు గోదాములకు నెలకు అద్దె రూ.8,191 కాగా, 48 నెలల కాలానికి రూ.7,86,336 చెల్లించాల్సి ఉంది. మొత్తంగా మార్కెట్‌లోని ఆరు గోదాముల రూ.1,11,81,600 అద్దె రూపంలో రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించాలని కలెక్టర్‌కు మార్కెట్‌ కార్యదర్శి పలుమార్లు లేఖ రాసినా స్పందన కరువైంది.

రైతులకు మొండి చేయి

మార్కెట్‌ గోదాములు నాలుగేళ్లుగా కలెక్టర్‌ ఆధీనంలో ఉండటంతో మార్కెట్‌ అధికారులు రైతులకు మొండిచేయి చూపుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోతే, వారు ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గతంలో కొద్దిపాటి అద్దె చెల్లించి ఉత్తత్తులను నిల్వ చేసే వెసులుబాటు ఉండగా ప్రస్తుతం అది లేకుండా పోయింది. అంతేగాక మార్కెట్‌కు నిధులు తక్కువగా ఉండటం, రూ.కోటికి పైగా అద్దె రావాల్సి రాకపోవడంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది.

పలుమార్లు లేఖ రాశాం : ఎండీ ఫసియుద్దీన్‌, సూర్యాపేట మార్కెట్‌ కార్యదర్శి

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న ఆరో గోదాములను ఎన్నికల అవసరాల కోసం కలెక్టర్‌కు స్వాధీనం చేశాం. అందుకు నాలుగు ఏళ్లకు చెందిన అద్దె రావాల్సి ఉంది. ఈ విషయమై కలెక్టర్‌కు పలుమార్లు లేఖ రాశాం. నిధులు విడుదల కావాల్సి ఉంది.

Updated Date - 2022-11-23T00:11:08+05:30 IST