రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-12-29T00:09:53+05:30 IST
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
మూడు హెలీప్యాడ్‌ల నిర్మాణం పూర్తి
రోడ్డు మార్గంలో గుట్టపైకి వెళ్లేలా ఏర్పాట్లు
యాదాద్రి, యాదగిరిగుట్ట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు భద్రతాపరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డితోపాటు ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, తదితర పోలీసు ఉన్నతాధికారులు, ఏవియేషన్, ఫైర్, అధికారులు రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. యాదగిరిగుట్ట ఉత్తర దశలోని పాతగోశాల వద్ద మూడు హెలీప్యాడ్‌లను అర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేశారు. హెలీక్యాప్టర్ ల్యాండింగ్ కాగానే, రోడ్డుమార్గంలో రెండోఘాట్ రోడ్డు నుంచి స్వామి దర్శనానికి కొండపైకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో హెలీప్యాడ్‌ల నుంచి రెండోఘాట్ రోడ్డువరకు ఫార్మేషన్ రోడ్డును వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఈ నెల 30వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక, బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు సమయం వరకు నిర్వహించే వివిధ ఆర్జిత, ఉభయ దర్శనాలను, బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆర్జిత సేవ నిత్య కైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
వైభవంగా తిరుప్పావై వేడుకలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం నిత్యవిధి కైంకర్యాలు, తిరుప్పావై వేడుకలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన ఆచార్యులు ప్రధానాలయ ఈశాన్య అష్టభుజి ప్రాకార మండపంలో ఆండాళ్ అమ్మవారిని కొలుస్తూ తిరుప్పావైపర్వాలను సంప్రదాయరీతిలో నిర్వహించారు. తిరుప్పావై పాశుర పఠనం చేసిన అర్చకులు పాశుర వైభవాన్ని భక్తులకు వివరించారు. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన ఆచార్యులు గజవాహన సేవోత్సవం జరిపి విశ్వక్సేనుడికి తొలిపూజలతో సుదర్శన నారసింహ హోమం, నిత్యతిరుకల్యాణపర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా రూ.25,70,660 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. యాదగిరీశుడిని బుధవారం తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ చైర్మన్ నగేష్, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.