Munugode By Election: మునుగోడులో ఓటర్ల చేతులపై కమలం పువ్వు గుర్తు
ABN , First Publish Date - 2022-10-29T20:07:59+05:30 IST
మునుగోడు (Munugode) నియోజకవర్గంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఓటర్ల చేతులపై మెహందీ (కోన్) ద్వారా కమలం పువ్వు గుర్తు వేయడాన్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ: మునుగోడు (Munugode) నియోజకవర్గంలో బీజేపీ (BJP) ఆధ్వర్యంలో ఓటర్ల చేతులపై మెహందీ (కోన్) ద్వారా కమలం పువ్వు గుర్తు వేయడాన్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు వివిధ ప్రాంతాల నుంచి బ్యూటీషియన్లను తీసుకువచ్చి పలువురు మహిళా ఓటర్లు, వృద్ధుల చేతులపై మెహందీతో కమలం పువ్వు గుర్తును వేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) ఆధ్వర్యంలో శనివారం మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. మునుగోడు మండలంలోని ఒక్క పలివెల గ్రామంలోనే 250మంది మహిళల చేతులపై కమలం పువ్వు గుర్తు వేశారని ఆరోపించారు. చేతులపై బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వు ఉంటే వారు ఓటు వేయడానికి అనర్హులయ్యే అవకాశాలు ఉంటాయని, అత్యధికంగా ఆసరా పింఛన్లు పొందుతున్న వారి చేతులపై పువ్వు గుర్తు వేస్తూ వారు ఓటు వేయకుండా అనర్హులు అయ్యేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ విషయమంపై టీఆర్‌ఎస్ (TRS) నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున సన్నిహితురాలైన ఒకరు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి వచ్చి పలువురికి మెహందీతో బీజేపీ ఎన్నికల గుర్తును పెడుతున్నారని తెలిపారు. కారు గుర్తుకు కచ్చితంగా పడే వృద్ధుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు. అదేవిధంగా వెల్మకన్నె గ్రామంలో కూడా మెహందీతో కమలం పువ్వు గుర్తును పెడుతున్నందున ఓట్లు చెల్లకపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఆ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం కూడా చౌటుప్పల్ మండలంలో ఇదే విధంగా మహిళల చేతులపై మెహందీ కోన్‌తో కమలం పువ్వు గుర్తు వేసిన విషయం తెలిసిందే.