By Election.. మునుగోడు: భారీ ర్యాలీలు, సభలకు ప్రధాన పార్టీల ప్లాన్
ABN , First Publish Date - 2022-11-01T11:27:34+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ ర్యాలీలు, సభలకు ప్లాన్ చేశాయి.
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు భారీ ర్యాలీలు, సభలకు ప్లాన్ చేశాయి. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ అగ్రనేతలు బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా గర్జన నిర్వహిస్తోంది. అభివృద్ధికే ఓటర్లు మొగ్గుచూపుతారనే ఆశలు టీఆర్ఎస్‌కు ఉండగా... ప్రత్యామ్నాయం కోరుకోవడం కలిసొస్తోందని బీజేపీ లెక్కలు వేస్తోంది. మహిళా సెంటిమెంట్ కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై గురిపెట్టాయి. రెండు ప్రధాన పార్టీలు డబ్బులు పంచుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కాగా 3న (గురువారం) మునుగోడు ఉపఎన్నికకు జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత పార్టీలు ప్రచారాన్ని నిలిపివేయాలని, స్థానికేతరులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆయన సూచించారు. ఆయా పార్టీల ప్రతినిధులు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు వంటివి ఇవ్వకూడదని, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయకూడదని హెచ్చరించారు. అదేవిధంగా ఎస్‌ఎంఎస్‌లపైనా నిషేధం విధించినట్లు చెప్పారు. దీనికి అనుగుణంగా నెట్‌వర్క్ ప్రొవైడర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న నిబంధనలను కచ్చితంగా పాటించి, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.