ఈ కేవైసీకి మరో అవకాశం
ABN , First Publish Date - 2022-12-04T23:28:14+05:30 IST
రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడువిడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పని సరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది.
- జిల్లాలో కిసాన్ పథకానికి 1.58 లక్షల మంది రైతులు
- ఇందులో చాలా వరకు గడువు లోపు ఈ కేవైసీ చేయించుకోలేదు
- ఇప్పటికీ చాలా మంది ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింక్ కాక అవస్థలు
- ఈనెల 31తో ముగియనున్న గడువు
కామారెడి టౌన్, డిసెంబరు 4: రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడువిడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పని సరిగా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించింది. గతంలో రెండు సార్లు గడువును పొడగించినా చాలా మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోకపోవడంతో మరోమారు అవకాశం కల్పించింది. పలు రాష్ట్రాల్లో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్‌లలో నిధులు కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించి సరైన అర్హులను గుర్తించేందుకు ఈ కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ కేవైసీని పూర్తిచేసిన రైతులకు మాత్రమే రూ.2వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులు నిలిపి వేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కిసాన్ సమ్మాన్ పథకానికి 1.58 మంది రైతులు
రాష్ట్రప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాన రూ.5వేల చొప్పున ప్రతీ సీజన్‌కు రైతుల ఖాతాలో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఇదే పథకం లాగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని గత నాలుగేళ్ల కిందట అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద ఎకరాన ఏడాదికి రూ.6వేల చొప్పున విడతల వారిగా అందించాలని నిర్ణయించింది. మూడు విడతలుగా రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో కేంద్రం పెట్టుబడి సాయాన్ని జమ చేస్తోంది. ఈ పథకానికి జిల్లాలో 1,58,470 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ కేంద్రప్రభుత్వం నిధులను జమచేస్తూ వస్తోంది. ఈ సీజన్ నుంచి ఈ పథకం కింద ఉన్న రైతులు ఈ కేవైసీ చేయించుకున్న వారికే పెట్టుబడి సాయం అందుతుందని కేంద్రం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు.
అనుసంధానం ఇలా..
రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలు ఇచ్చినా తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకోవాలి. తదుపరి ఆధార్‌కార్డుకు ఫోన్ నెంబర్‌ను అనుసంధానం చేయాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారితంగా ఈ కేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్‌నెంబర్‌కు వచ్చే రెండు ఓటీపీలను నమోదు చేస్తేనే ఈ కేవైసీ పూర్తవుతుంది. సెల్‌ఫోన్‌లో పీఎం కిసాన్‌యాప్ ద్వారా లేదంటే పోర్టల్ ద్వారా నేరుగా కామన్ సర్వీస్ సెంటర్‌లో కూడా ఈ కేవైసీని పూర్తి చేయాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తిచేసిన అర్హులైన రైతులు బ్యాంక్ ఖాతాకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులను జాబితా నుంచి తొలగిస్తారు.
అవగాహన కరువు
ఆధార్ అనుసంధానం, ఈ కేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే కొంత మంది రైతులు ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. వ్యవసాయాధికారులు ఆయా మండలాల్లో వివరించడంతో వెళ్తున్న వారు, ఈ కేవైసీ చేసుకోవాలని వెళ్తున్న వారికి మీ సేవ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్ నెంబర్‌లు లింక్ లేకపోవడం లాంటి కారణాలతో తిరగాల్సి వస్తోంది.