మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు

ABN , First Publish Date - 2022-12-04T00:34:31+05:30 IST

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు రేపుతోంది. ప్రజలకు మరో 20ఏళ్లు ఏ చీకు చింత లేకుండా అన్ని విధాల సౌకర్యాలను కల్పించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ చేస్తున్నామంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మార్క్‌ను చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు
ఇండస్ట్రియల్‌ జోన్‌గా మార్చవద్దని టీపీఓకు వినతి పత్రం అందిస్తున్న అడ్లూర్‌ ఎల్లారెడ్డి రైతులు

మరికొన్ని రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం

- మాస్టర్‌ ప్లాన్‌పై ప్రజలు, రైతుల నుంచి వస్తున్న తీవ్ర అభ్యంతరాలు

- నిత్యం మున్సిపల్‌ కార్యాలయానికి తరలివస్తున్న రైతులు

- పంట భూములను పరిశ్రమల భూములుగా మార్చేందుకు యత్నం

- తమ తాతాల నాటి భూములను పరిశ్రమ భూములుగా మార్చడంపై అభ్యంతరం

- జన్మభూమి రోడ్డు వెడల్పు మార్పుపై సైతం తీవ్ర అభ్యంతరాలు

- లింగాపూర్‌లోని పంట పొలాల మీదుగా 100 ఫీట్ల రోడ్డును వేస్తుండడంపై రైతుల గగ్గోలు

- ఎవరి స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ చేస్తున్నారంటూ మండి పాటు

- రైతులు, ప్రజల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకునేనా?

కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, నవంబరు 3: కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు రేపుతోంది. ప్రజలకు మరో 20ఏళ్లు ఏ చీకు చింత లేకుండా అన్ని విధాల సౌకర్యాలను కల్పించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ చేస్తున్నామంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మార్క్‌ను చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో రూపకల్పన చేయిస్తుండగా ఆ సంస్థ తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌పై కొన్ని ప్రాంతాల రైతులు, ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో టాన్‌ విస్తీర్ణం 61.55 చదరపు కి.మీ.లు చూపారు. ఇందులో రెసిడెన్షియల్‌ ఏరియా 6,806 ఎకరాలు, కమర్షియల్‌ ఏరియా 557 ఎకరాలు, మల్టీపర్పస్‌ 667 ఎకరాలు, గవర్నమెంట్‌ బిల్డింగ్స్‌, స్థలాలు 635 ఎకరాలు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం 1,445 ఎకరాలు, ఇండస్ట్రియల్‌ ఏరియాగా 1,210 ఎకరాలు ప్రతిపాదించారు. అయితే కొన్నిచోట్ల ఇష్టారీతిన వ్యవహరించారని పంట పొలాల్లోంచి 100 ఫీట్ల రోడ్లు ఎవరి కోసం వేస్తున్నారని, నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు స్వార్థం కోసం రోడ్డు వెడల్పును 80 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు మార్పులు చేశారని ప్రజలు, తాతల కాలం నుంచి పట్టా భూములుగా ఉన్న వాటిని ఇండస్ట్రియల్‌ భూములుగా మార్పులు చేయడం ఎంత వరకు సబబు అని రైతులు మున్సిపల్‌ అధికారులను ప్రశ్నిస్తున్నారు. శనివారం వరకు కామారెడ్డి మున్పిపల్‌ కార్యాలయానికి 200 అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు రాగా అందులో 100కు పైగా రైతులు ఇండస్ట్రియల్‌ జోన్‌పై ఈ విధంగా కేటాయించడమేంటనే ప్రశ్నిస్తూ అధికారులకు వినతిపత్రం అందిస్తున్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే ఆలోచన చేయాలే తప్ప కొందరి కోసం రోడ్డు విస్తరణను కుదించడం, అవసరం లేని చోట రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదనలు చేస్తూ ప్రైవేట్‌ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించడం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలా ప్రజలు, రైతులు అభ్యంతరాలు చేస్తుంటే వారి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటారా లేక ఎప్పటిలాగే తాము చేసేందే వేదం అనేలా వ్యవహరిస్తారా అనే దానిపై మున్సిపల్‌ కార్యాలయంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రజల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇండస్ట్రియల్‌ జోన్‌ ఏవిధంగా ఏర్పాటు చేస్తారంటూ మండిపాటు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో సిరిసిల్లా రోడ్డులోని రాజీవ్‌పార్క్‌ ప్రాంతం ఇండస్ట్రియల్‌ జోన్‌గా ఉండేది. నూతన జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత దేవునిపల్లి, లింగాపూర్‌, టెక్రియాల్‌, అడ్లూర్‌, పాత రాజంపేట, రామేశ్వర్‌పల్లి, సరంపల్లి గ్రామాలను కామారెడ్డి మున్సిపల్‌లో చేర్చారు. మున్సిపల్‌ పరిధి పెరగడంతో ప్రజలకు సౌకర్యార్థం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ ఇల్చిపూర్‌, పాత రాజంపేట, అడ్లూర్‌, టెక్రియాల్‌ ప్రాంతాలోని భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌గా చేయడంపై మండిపడుతూ మున్సిపల్‌ కార్యాలయానికి నిత్యం వస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. తాతల కాలం నాటి భూములను ఏ విధంగా ఇండస్ట్రియల్‌ జోన్‌లుగా చేస్తారని దాని వల్ల తమ భూములకు ముందు ముందు సరైన విలువ ఉండదని, నివాస గృహాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉండదని ఇలా చేయడం ఏంటని మండి పడుతున్నారు. వెంటనే తమ భూములను ఇండస్ట్రియల్‌ జోన్‌లోంచి తీసివేయాలని అధికారులను కోరుతున్నారు. అయితే గతంలో సిరిసిల్ల రోడ్డులో ఉన్న ఇండస్ట్రియల్‌ జోన్‌ను మరింత వెనక్కి జరిపి బైపాస్‌ ప్రాంతంలో ఏర్పాటుచేయడంపై అక్కడి రైతులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో 7 నుంచి 9 శాతం ఏరియాను తప్పనిసరిగా ఇండస్ట్రియల్‌ ఏరియాగా చూపాలని ఉండడంతో టౌన్‌ విస్తీర్ణం అనుగుణంగా ఇండిస్ట్రియల్‌ ఏరియాను ప్రతిపాదించారు.

ఎవరి స్వలాభం కోసం రోడ్లు వేస్తున్నారంటూ ప్రశ్నలు

లింగాపూర్‌ ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డును వేస్తూ ప్రతిపాదించడం, జన్మభూమి రోడ్డును 80 ఫీట్ల నుంచి 60 ఫీట్లకు కుదించడంపై అటు ఆ ప్రాంతవాసులతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం ఎవరి స్వలాభం కోసం రోడ్లు వేస్తున్నారని, ఎందుకు రోడ్డు వెడల్పును కుదిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అంటే రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలే కాని ఇలా కుదించడంపై ఎవరి స్వలాభం ఉందో మున్సిపల్‌ అధికారులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇక లింగాపూర్‌ ప్రాంతంలో పట్టా భూములోంచి రోడ్డు ఎవరి కోసం ఎందుకోసం వేస్తున్నారో అది సైతం తెలపాలని అటు రైతులు, ఇటు ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొందరు వెంచర్లకు అనుకూలంగా ఉండేందుకు ఈ రోడ్డు ప్రతిపాదన తీసుకువచ్చారని అవసరం ఉన్నచోట ఎలాంటి సౌకర్యాలు కల్పించకున్నా అవసరం లేని చోట మాత్రం కొందరి స్వలాభం కోసం రోడ్డు వేస్తుండడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చిన రైతులు

మాస్టర్‌ ప్లాన్‌లో పంట భూములు పరిశ్రమల భూములుగా మార్చవద్దంటూ కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలను శనివారం హైదరాబాద్‌లో లింగాపూర్‌, టెక్రియాల్‌, అడ్లూర్‌ ఎల్లారెడ్డి రైతులు విన్నవించారు. మార్చేందుకు ప్రయత్నిస్తామని రైతులకు ఎమ్మెల్యేలు హామీ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లినట్లు సమాచారం. కేటీఆర్‌ మున్సిపల్‌ మంత్రిగా ఉండడంతో మాస్టర్‌ ప్లాన్‌ మార్చే అవకాశాలు లేకపోలేవు. తాతల కాలం నుంచి పంటలు పండించుకుంటూ సంతోషంగా బతుకుతున్న తమకు ఇండస్ట్రియల్‌ జోన్‌గా ఏర్పాటు చేస్తే పంటలను పండించే భూములను కోల్పోవాల్సి వస్తుందని పడావు భూములలో ఇండస్ట్రియల్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని రైతులు ఎమ్మెల్యేలను కోరారు.

Updated Date - 2022-12-04T00:34:34+05:30 IST