జిల్లాలో 65వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం

ABN , First Publish Date - 2022-11-18T23:54:41+05:30 IST

ఆయిల్‌ పామ్‌ పంటతో రైతులు ఆర్థికంగా ఎదగుతారని, పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

జిల్లాలో 65వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు లక్ష్యం
వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్‌ పామ్‌ మొక్కలను నాటుతున్న స్పీకర్‌ పోచారం

- రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించాలి

- అంతర్‌ పంటలతో రెండు విధాలుగా రైతులకు ఆదాయం

- త్వరలో కామారెడ్డి జిల్లాలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ

బాన్సువాడ టౌన్‌, నవంబరు 18: ఆయిల్‌ పామ్‌ పంటతో రైతులు ఆర్థికంగా ఎదగుతారని, పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో పరిగె వెంకట్రామిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 5 ఎకరాల్లో పామ్‌ ఆయిల్‌ మొక్కలను నాటారు. అనంతరం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో పామాయిల్‌ పంటపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దగ్గర పామాయిల్‌ లేకపోవడంతో ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ప్రతీ సంవత్సరం 80 వేల కోట్ల రూపాయల వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. మన రైతులు ఈ పంటను పండిస్తే సంవత్సరానికి రెండున్నర లక్షల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అందులో పెట్టుబడి ఖర్చు పోగా లక్ష రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటి న తర్వాతమూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు చెట్టు పెరిగేందుకు సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు రైతులు అంతర్‌ పంటలను వేసుకోవచ్చన్నారు. కుసుమలు, కందులు, సోయాబీన్‌, పల్లి తదితర పంటలను వేసుకుని రెండు విధాలుగా ఆదాయం పొందవచ్చన్నారు. ఒక్కసారి ఆయిల్‌ పామ్‌ మొక్క నాటితే 30 ఏళ్ల వరకు చెట్టు ఉంటుందన్నారు. ఈ పంట వేస్తే పశువులు, అడవి జంతువులతో ఇబ్బందులు ఉండవన్నారు. ఆయిల్‌ పామ్‌ యాక్ట్‌ ప్రకారం కంపెనీలు రైతుల నుంచి గెలలను సేకరిస్తుందన్నారు. 3 నుంచి 5 రోజులలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయన్నారు. ఆయిల్‌ పామ్‌ రైతులకు ఏడాదిలో 6 నుంచి 7 నెలల పాటు ఆదాయం వస్తుందన్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల రైతులు ఆయిల్‌ పామ్‌ పంటలతో ఆదాయం ఘననీయంగా సంపాదిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఆయిల్‌పామ్‌ పంట సాగుపై వివరించి చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 65వేల ఎకరాల ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలనేదే లక్ష్యమన్నారు. రూ.200 విలువైన ఆయిల్‌పామ్‌ మొక్కను రైతులకు సబ్సిడీపై రూ.20లకే అందిస్తోందని, నాలుగు సంవత్సరాలకు అన్ని రకాల సబ్సిడీ కలిపి 41వేల ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. త్వరలో కామారెడ్డి జిల్లాలో పామాయిల్‌ ఫ్యాక్టరీ వస్తున్నట్లుగా ఆయన తెలిపారు. రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మెన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రమొహన్‌ రైతులు తదితరులున్నారు.

పాత బాన్సువాడలో పర్యటించిన స్పీకర్‌ పోచారం

బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పాత బాన్సువాడలో శుక్రవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మిషన్‌ భగీరథ నీరు ఏ మేరకు వస్తుందో పరిశీలించారు. పట్టణంలో తాగునీటికి ఢోకా లేదని రెండు పర్యాయాలు తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు.

Updated Date - 2022-11-18T23:54:43+05:30 IST