Bharat Jodo Yatra: దేశానికి దిక్సూచి రాహుల్: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-11-06T20:22:14+05:30 IST
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఒక దిక్సూచిగా కనిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.
మెదక్: క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఒక దిక్సూచిగా కనిపిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సృష్టిస్తున్న గందరగోళం నుంచి ప్రజలకు విముక్తి కల్గించడానికి రాహుల్ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టారని చెప్పారు. దేశ ప్రజలు రాహుల్‌లో ఒక పరిణితి చెందిన నేతను చూస్తున్నారని పేర్కొన్నారు. దేశ విశాల ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం ప్రజల అదృష్టమన్నారు. ప్రతి రోజు పాదయాత్రతో వివిధ వర్గాల ప్రజలు వచ్చి కలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రాహుల్ గాంధీని ఒక పరిష్కార మార్గంగా భావిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. గత నెల 23 నుంచి తెలంగాణలో కొనసాగుతున్న జోడో యాత్ర సోమవారం నాటితో దిగ్విజయంగా ముగుస్తుందని తెలిపారు. భారత్ జోడో యాత్ర క్విట్ ఇండియా ఉద్యమం సరసన నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలుపెరగని భారత్ జోడో యాత్ర లో యువత, వృద్ధులు, మహిళలు రాహుల్‌తో పోటీపడి నడవడం గొప్ప విషయంగా రేవంత్‌రెడ్డి అభివర్ణించారు.
మోదీ, అమిత్‌షా, కేసీఆర్ అవలంభిస్తున్న విధానాల వలన దేశ ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కులాలు, మతాలు, భాషల పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు అధికారంపై ఉన్న ధ్యాస ప్రజలపై లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాహుల్ పాదయాత్ర చేయకుండా ఈడీ, ఐటీలతో కేంద్రం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా రాహుల్‌ను లొంగదీసుకోవాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా జోడో యాత్ర ఆగలేదని స్పష్టం చేశారు. చివరకు పాదయాత్ర చేస్తే ప్రాణాలకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా రాహుల్ గాంధీ మాత్రం తన పాదయాత్రను ఆపలేదన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ను ప్రజలు నెల్సన్ మండేలాల చూస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు.