ప్రాణం తీసిన సరదా
ABN , First Publish Date - 2022-10-31T04:43:44+05:30 IST
సరదా కోసం ఆడిన నిధి వేట ఆట (ట్రెజర్ హంట్ గేమ్) ఓ యువకుడి ప్రాణం తీసింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో శనివారం
యువకుడిని బలిగొన్న ట్రెజర్ హంట్ గేమ్
బావిలో వేసిన వస్తువును వెతికి తేవడమే లక్ష్యం
హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ మూన్‌లైట్ క్యాంపింగ్‌లో విషాదం
వికారాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సరదా కోసం ఆడిన నిధి వేట ఆట (ట్రెజర్ హంట్ గేమ్) ఓ యువకుడి ప్రాణం తీసింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో శనివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన దాదాపు 150 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శనివారం సాయంత్రం వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ శివారులో ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్స్ క్లబ్ మూన్‌లైట్ క్యాంపింగ్ స్థలానికి వచ్చారు. తొలుత అక్కడ నిర్వహించిన వివిధ ఈవెంట్లలో పాల్గొన్నారు. ఆ తరువాత ట్రెజర్ హంట్ గేమ్ ఆడారు. అందులో భాగంగా ఆటకు సంబంధించిన క్లూ (వస్తువు) అక్కడున్న పెద్ద బావిలో వేశారు. ఆ బావిలో వేసిన వస్తువును ఎవరు ముందు తెస్తే వారే విజేత అని ప్రకటించారు. తన మిత్రులతో కలిసి వచ్చిన సికింద్రాబాద్‌లోని ఏఎ్‌సరావు నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయికుమార్ (35) ఆ వస్తువు కోసం బావిలోకి దూకాడు. నీటిలో దాని కోసం వెతుకుతూ చివరికి నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సాయికుమార్ ఎంతకూ బయటకు రాకపోయే సరికి స్నేహితులు బావి వద్దకు వచ్చి చూశారు. అతడు కనిపించకపోవడంతో వారు ధారూరు పోలీసులకు సమాచారచ్చారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని బావిలో నుంచి సాయికుమార్‌ను బయటకు తీసి వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు. సాయికుమార్‌కు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇలాంటి సాహస క్రీడలు ఆడే సమయంలో తప్పనిసరిగా భద్రతా చర్యలు పాటించాల్సి ఉన్నా అవేమీ పట్టించుకోకపోవడంతోనే ఓ నిండు ప్రాణం పోయింది. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారాంతాల్లో 3వేల మంది..
వికారాబాద్ ప్రాంతం చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు ఉండడంతో ఈ ప్రాంతానికి వారాంతాల్లో మూడు వేల మంది దాకా పర్యాటకులు వస్తుంటారు. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పని ఒత్తిడితో సతమతమయ్యే వారు మానసిక ప్రశాంతత పొందేందుకు అనంతగిరి కొండలకు వస్తుంటారు. వారి ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేందుకు వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు పది రిసార్టులు వెలిశాయి. వీటిల్లో క్యాంప్‌పైర్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్ తదితర ఈవెంట్లతో పాటు ఇతర సాహసక్రీడలూ నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్లలో రివ్యూలు చూసి, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని చాలామంది ఈ రిసార్టులకు వస్తుంటారు. దీంతో వారాంతాల్లో అన్ని రిసార్టులూ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
నైట్‌క్యాంపింగ్‌కు క్రేజ్
రిసార్టుల్లో నిర్వహించే నైట్‌క్యాంపింగులకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటివాటికి కుటుంబాలతో వచ్చే వారి కంటే యువతీ యువకులే ఎక్కువ మంది వస్తుంటారు. ఆహ్లాదం పంచే ఈవెంట్స్‌తో పాటు కిక్కెక్కించే ఆటాపాటా కూడా పెడతారు. డీజే మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్సు చేస్తారు. అనుమతి లేకున్నా రిసార్టుల్లో మద్యం తాగే వారికి తాగినంత.. కోరుకున్నంత మద్యం అందుబాటులో ఉంటుంది. గుర్తింపు కార్డు మినహా ఇతర ఆంక్షలేమీ లేకపోవడంతో హైదరాబాద్ నుంచి చాలామంది ఈ రిసార్టులకు ఎక్కువగా వస్తున్నారు. ఇలా వచ్చేవారు అనంతగిరి అటవీ ప్రాంతాల్లో మద్యం తాగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. అటవీ శాఖ నుంచి అనుమతులు లేకున్నా రిసార్టుల నిర్వాహకులు వారిని అడవిలోకి ట్రెక్కింగ్‌కు తీసుకెళ్తున్నారు. అటవీ, పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. నామమాత్రంగా స్థానిక అనుమతులతో కొనసాగిస్తున్నారు.
భద్రతా చర్యలు కరవు
పర్యాటకులను ఆకర్షించేందుకు రిసార్టుల నిర్వాహకులు ఆహ్లాదకర ఈవెంట్లు, ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌తో పాటు.. అనుమతుల్లేకుండానే సాహసక్రీడలను నిర్వహిస్తున్నారు. అలాంటి క్రీడలు ఆడే సమయంలో తప్పని సరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలి. వాటిలో పాల్గొనేవారు గాయపడకుండా, ప్రాణాలు కోల్పోకుండా సుశిక్షితులైన గైడ్‌లను ఏర్పాటు చేయాలి. కానీ, ధనార్జనే లక్ష్యంగా వ్యవహరిస్తున్న రిసార్ట్స్ యాజమాన్యాలు.. భద్రతా చర్యలు పాటించకుండానే సాహస క్రీడలు నిర్వహిస్తున్నాయి. పర్యాటకుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కొన్నిసార్లు పర్యాటకులు ప్రాణాలు కోల్పోతుండడం చర్చనీయాంశంగా మారిం ది. ఉదాహరణకు.. ఐదేళ్ల క్రితం గోధుమగూడ సమీపంలోని ఓ రిసార్టులో అడ్వెంచర్ బైక్ రైడింగ్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ ప్రాణా లు కోల్పోయాడు. ఇటీవల గుడుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో స్విమ్మింగ్ పూల్‌లో పడి ఓ చిన్నారి మృతిచెందింది.