ఘనంగా కాళోజీ సోదరుల యాది సభ
ABN , First Publish Date - 2022-11-14T00:10:27+05:30 IST
హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలోని సెమినార్ హాలులో ఆదివారం కాళోజీ సోదరుల యాదిసభ జరిగింది. కాళోజీ పౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త, పత్రిక సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా కాళోజీ సోదరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
హనుమకొండ కల్చరల్, నవంబరు 13: హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలోని సెమినార్ హాలులో ఆదివారం కాళోజీ సోదరుల యాదిసభ జరిగింది. కాళోజీ పౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త, పత్రిక సంపాదకుడు డాక్టర్ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా కాళోజీ సోదరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యం నిరంకుశ పోకడలను కాళోజీ సోదరులు నిరసించి ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సును కోరారని అన్నారు. అణచివేతకు గురువుతున్న పీడిత ప్రజల పక్షాన నిస్వార్థంగా పని చేయడమే కాకుండా నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తమ కవిత్వంతో మేల్కొలిపిన గొప్ప కవి సోదరులు కాళోజీ సోదరులని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి ఎలనాగ అనువాదం చేసిన మై లామెంట్ కాళోజీ కవితల ఇంగ్లీషు అనువాద కావ్యాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కావ్యాన్ని ప్రముఖ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పరిచయం చేశారు.
అనంతరం కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి విఆర్.విద్యార్థి 30 ఏళ్లుగా కాళోజీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమ వివరాలను క్లుప్తంగా నివేదిక సమర్పించారు. ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించగా డాక్టర్ కె.రామచంద్రమూర్తికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురస్కారం, ప్రముఖ ఉర్దూ కవి డాక్టర్ కుత్బ సర్ షార్కు కాళోజీ రామేశ్వర్రావు స్మారక పురస్కారం అందజేసి శాలువ, మెమోంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్ స్వాగతం పలుకగా ఫౌండేషన్ నిర్వాహణ కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఎన్.చారి, సిరాజుద్దిన్, నెల్లుట్ల రమాదేవి, గంట రామిరెడ్డి, వల్లంపట్ల నాగేశ్వర్రావు, పాతూరి రాఘురామయ్య, డాక్టర్ మంథని శంకర్ తదితరులు పాల్గొన్నారు.