బీజేపీతో దోస్తీ కట్టనంత వరకే... టీఆర్‌ఎ్‌సతో మా దోస్తానా!
ABN , First Publish Date - 2022-11-26T00:25:13+05:30 IST
‘కమ్యూనిస్టు పార్టీ సరికొత్త పోరాట రూపాలతో ప్రజల ముందుకు వెళ్తోంది.. అమోఘమైన కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, త్యాగాలను నేటి తరానికి వివరిస్తాం.. అణగారిన వర్గాల ప్రశ్నించే గొంతుకగా మారుతాం.. పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పారు.
కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు కాలం చెల్లలేదు..
డబ్బు ఓటును ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది
కాలానుగుణంగా పోరాట రూపాలు రూపొందిస్తున్నాం..
పోడు సమస్య పరిష్కారానికి మా సహకారం తీసుకోవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ఓరుగల్లు, నవంబర్ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కమ్యూనిస్టు పార్టీ సరికొత్త పోరాట రూపాలతో ప్రజల ముందుకు వెళ్తోంది.. అమోఘమైన కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, త్యాగాలను నేటి తరానికి వివరిస్తాం.. అణగారిన వర్గాల ప్రశ్నించే గొంతుకగా మారుతాం.. పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం..’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పారు.
ప్ర: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయని గుర్తించారు..?
జవాబు: నేను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. పార్టీ నాయకత్వం ఆ పనిలోనే ఉంది. భూ సమస్య, పేదలకు నిలువనీడ లేని అంశాలతోపాటు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం.. మత ఛాందసవాద ముసుగులో పొంచి ఉన్న ప్రమాదాల పట్ల ప్రజలను జాగృతం చేయడం లాంటి అనేక అంశాలు ఉన్నాయి.
ప్ర: కమ్యూనిస్టు పార్టీ గతంలో చేసిన విధంగా అన్నిరంగాల్లో క్రియాశీలక పోరాటాలకు దూరంగా ఉందన్న విమర్శ ఉంది.. ఏమంటారు...?
జ: ఆ విమర్శలో నిజం లేదు. ఇప్పటికీ పోరాటాలు అంటే నే కమ్యూనిస్టు పార్టీ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పోరాటాలు అన్న భావన ప్రజల్లో ఉంది. అయితే గతంలో ఉన్నంత బ లంగా లేకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యవస్థలో వచ్చిన అనేక రకాల మార్పులు, కార్పొరేట్ శక్తులు అనే క రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కార్మికచట్టాలకు తూట్లు పొడవడం.. గతంలో దోపిడీ ప్రత్యక్షంగా కనిపించే ది. ఇపుడు వివిధ రూపాల్లో దోపిడీ కొనసాగడం.. అదీ ప్రజలకు అర్థం కాకపోవడం, దాన్ని అర్థం చేయించడంలో కొంత సమయం పడుతోంది. అంతే.
ప్ర: కాలం చెల్లిన సిద్ధాంతం వల్ల కమ్యూనిస్టు పార్టీలు సమకాలీన సమాజాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడంలో వైఫల్యం వల్లనే అస్తిత్వ సమస్య ఎదురవుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.. మీరేమంటారు..?
జ: అది తప్పుడు అవగాహన. కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు కాలం చెల్లినవి అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రజల తరపున పోరాడే ఏకైక శక్తులుగా కమ్యూనిస్టుపార్టీలు ఎందుకు మిగిలాయి. అస్తిత్వానికి కొలమానం ఓట్లు, సీట్లు మాత్రమే కావు కదా..
ప్ర: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకుని పాలన చేయడమే కొలమానం అంటారు కదా.. ఓట్లు, సీట్లు కావంటే ఎలా..?
జ: నిజమే.. ఓటు అనేక అంశాలుగా ప్రలోభాలకు గురవుతోంది. మేము వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచుతాం. ప్రజలను మాయ చేయడం, మద్యం, డబ్బుల ద్వారా ప్రలోభాలకు గురిచేయలేం. రాజకీయపార్టీలు ప్రజలను మతం, కులంలాంటి సున్నితమైన అంశాలను కూడా ఓటుకోసం వాడుకుంటున్నారు. మేం అలా చేయలేం. ప్రజలెప్పుడూ మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటారు. ఎన్నికల సమయంలో మాత్రం ప్రలోభాలకు గురవుతున్నారు. ముఖ్యంగా డబ్బులు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రలోభాలకు దూరంగా ఉండే విధంగా ప్రజలను చైతన్య పరిచేందుకు మరింతగా కృషి చేస్తాం.
ప్ర: టీఆర్‌ఎ్‌సతో పొత్తు మునుగోడు వరకేనా..? వచ్చే అ సెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందంటారా...? పొత్తు ఉంటే ఎన్ని సీట్లల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందంటారు..?
జ: ఈ అంశం మాట్లాడడానికి చాలా సమయం ఉంది. బీజేపీని వ్యతిరేకించేంత వరకు టీఆర్‌ఎ్‌సతో కలిసి పోరాడు తాం.. రాష్ట్రమంతా గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి మాత్రం సీపీఐకి ఉంది. పొత్తు కుదిరినప్పుడు కదా.. ఎన్ని సీట్లు అన్న చర్చ ఉండేది.
ప్ర: రాష్ట్రంలో పోడు సమస్య మరింత జటిలమవుతోంది..? ఫారెస్ట్ అధికారులకు తుపాకులు ఇవ్వాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. అదే విధంగా ఇటీవల జరిగిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్య పట్ల మీరేమంటారు..?
జ: ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్యలు ఎప్పుడూ పరిష్కారం కానేకావు. శ్రీనివాసరావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోడు సమస్య తక్షణం పరిష్కారం చేయాల్సిన సమస్య. పోడు రైతుల పక్షాన నిలబడి మా పార్టీ పోరాటం చేసింది. నామీద ఇప్పటికీ నాలుగు కేసులు ఉన్నాయి. ఆదివాసీ రైతులు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో పోడు సమస్యపై పోరాటం చేసిన మాలాంటి పార్టీల ప్రతినిధులుగా పంపాలి. నిర్ణీత గడువు విధించాలి. వెంటనే సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుంది.
ప్ర: కమ్యూనిస్టు పార్టీలకు విద్యార్థులు, యువత దూరం అయ్యారన్న విమర్శ ఉంది.. నిజమేనంటారా..?
జ: దూరం కాలేదు.. గతంలో ఉన్నంత స్థాయిలో మాత్రం లేరు. దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు, కెరీరిజం కారణం. సోషల్ మీడియా ద్వారా యూత్‌ను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. వేగవంతమైన ఆధునిక జీవన విధానం, విద్యావిధానంలో మార్కులు, ర్యాంకుల చుట్టే విద్యార్థులను వ్యవస్థ తిప్పుతోంది. దీంతో సామాజిక అంశాల పట్ల అధ్యయనం లేకుండా పోయింది. కమ్యూనిస్టు పార్టీ చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాట ఫలితాలను వారికి వివరిస్తాం. అన్ని విధాలుగా కమ్యూనిస్టు పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం.
ప్ర: కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు పాటలతో హోరెత్తించేవి. సోషల్‌మీడియాలో పాటలకే పట్టం కడుతున్న తరుణంలో పాటను ఎందుకు పట్టించుకోవడంలేదంటారు..?
జ: ఈ విషయంలో మేం కొంత వెనుకబడి ఉన్నాం. ఇపుడు దృష్టి సారించాం. సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేస్తున్నాం. అదే విధంగా సాంస్కృతిక విభాగంపై కూడా దృస్టి సారించాం. త్వరలోనే మీకు ఆ ఫలితాలు కనబడతాయి.