రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు..
ABN , First Publish Date - 2022-11-10T23:54:39+05:30 IST
అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్వగృహంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.
హనుమకొండ రూరల్, నవంబరు 10: అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తూ రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ స్వగృహంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సొంత పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని తెలిపారు. గవర్నర్ తన ఫోన్‌ని ట్యాపింగ్ చేస్తున్నారని ఆమె చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వతంత్రంగా పనిచేయకుండా అన్ని వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారన్నారు. మునుగోడు ఎన్నికల్లో గెలవగానే ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని భావించి అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ గెలవాలని చూస్తున్నారని తెలిపారు. ఆయన కుట్రలు, మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందాలని ప్రధాని నరేంద్రమోదీ చూస్తుంటే కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం, సీపీఐలతోపాటు పలు సంఘాలను రెచ్చగొట్టి ప్రధాని పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో రావు పద్మతోపాటు జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందంగౌడ్, జయంత్‌లాల్, మలకపేట భాగ్యనగర్ ఇన్‌చార్జి కేవీఎల్‌ఎన్.రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల సత్యనారాయణ, హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రావు పద్మకు పరామర్శ
కారు ప్రమాదంలో గాయపడిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను ఈటల రాజేందర్ పరామర్శించారు. గురువారం హంటర్‌రోడ్‌లోని పద్మ స్వగృహంలో జిల్లా ఇన్‌చార్జి డాక్టర్ వి.మురళీధర్‌గౌడ్‌తో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందంగౌడ్, మలకపేట భాగ్యనగర్ ఇన్‌చార్జి కేవీఎల్‌ఎన్.రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కందగట్ల సత్యనారాయణ, హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.