అయ్యో.. తల్లీ..
ABN , First Publish Date - 2022-11-11T23:46:45+05:30 IST
వరకట్న దురాచారం.. ఓ పసిపాపను, వివాహితను కాటేసింది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత.. తన 11 నెలల కూతురితో బలవన్మరణానికి పాల్పడింది. వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు, మనవరాలి మృతికి తన అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త వరకట్న వేధింపులతో బలవన్మరణం
దామెర మండలంలో ఘటన
దామెర, నవంబరు 11: వరకట్న దురాచారం.. ఓ పసిపాపను, వివాహితను కాటేసింది. అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత.. తన 11 నెలల కూతురితో బలవన్మరణానికి పాల్పడింది. వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు, మనవరాలి మృతికి తన అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషాద ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పరసుగొండ క్రాస్ రోడ్లో చోటుచేసుకుంది. దామెర పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
శాయంపేట మండలం కాట్రపల్లికి చెందిన రావుల మోహన్-సరళ దంపతుల కూతురు ఆమనికి.. ఆత్మకూరు మండలం హౌజ్బుజుర్గు గ్రామానికి చెందిన నిమ్మల బుచ్చయ్య-స్వరూప దంపతుల కుమారుడు మురళితో 8యేళ్ల కిందట వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.8లక్షల కట్నంతో పాటు అన్ని లాంఛనాలతో సంప్రదాయ రీతిలో వివాహం జరిపించారు. ప్రస్తుతం వీరు హౌజ్బుజుర్గు గ్రామంలో డీజే సౌండ్స్, టెంట్ హౌస్ పెట్టుకుని జీవన ం సాగిస్తున్నారు. అయితే వివాహం జరిగిన కొంత కాలానికే ఆమనికి అదనపు కట్నం కోసం వేఽధింపులు మొదలయ్యాయి. 8 ఏళ్లుగా భర్త మురళి కట్నం కోసం వేధింపులు పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో వేధింపులు భరించలేక ఆమని గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్తానని ఇంట్లో చెప్పి తన కూతురుతో పాటు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో మురళితో పాటు కుటుంబసభ్యులు.. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకుండా పోయింది.
ఈ క్రమంలో దామెర మండలం ఊరుగొండ సమీపంలో పసరుగొండ క్రాస్ రోడ్లోని బొల్లు సమ్మిరెడ్డి వ్యవసాయ బావిలో ఆమని(29)తో పాటు కూతురు ఆశ్రితసాయి(11నెలలు వయస్సు) ఇద్దరు శవాలై తేలారు. అటుగా వెళ్లిన బాటసారులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను ఎంజీఎంకు తరలించారు. మురళి నిత్యం తమ కూతురు ఆమనిని వరకట్న వేధింపులకు గురిచేసే వాడని తల్లి రావుల సరళ తెలిపారు. తన కూతురు, మనవరాలు మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దామెర ఎస్సై ఎ.హరిప్రియ కేసు నమోదు చేయగా, పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారు.