లక్ష్మీ పంప్‌హౌజ్ ఎత్తిపోతలు షురూ..
ABN , First Publish Date - 2022-12-19T00:25:04+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్‌హౌజ్‌లో ఆదివారం రాత్రి ఎత్తిపోతలు పునఃప్రారంభమయ్యాయి.
మహదేవపూర్, డిసెంబరు 18: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంప్‌హౌజ్‌లో ఆదివారం రాత్రి ఎత్తిపోతలు పునఃప్రారంభమయ్యాయి. జూలైలో భారీ వరదకు నీటమునిగిన మోటార్లలో రెండింటికి మరమ్మతులు పూర్తికావడంతో వాటిని అధికా రులు పునరుద్ధరించారు. వీటి ద్వారా లక్ష్మీపంప్ హౌస్‌లోని నీటిని గ్రావిటీ కాల్వ ద్వారా సరస్వతీ బ్యారేజీలోకి పంపించనున్నారు.
లక్ష్మీపం్‌పహౌ్‌సలో రెండో టీఎంసీ నిమిత్తం 11 మోటార్లను బిగించారు. ఆ తర్వాత మూడో టీఎంసీ ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో మరో ఆరు మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జూలై 13న సంభవించిన భారీ వరదలకు గోదావరి ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ఒక్క మోటారు ద్వారా నీటిని ఎత్తిపోశారు. జూలై 14న వరద నీరు గోదావరిలో భారీగా చేరడంతో పంప్‌హౌ్‌సలోని బేస్‌బే కూలిపోయింది. దీంతో మొత్తం 17 మోటార్లు నీటమునిగాయి. ఇవి బయట పడేందుకు ఇంజనీరింగ్ అధికారులు రేయింబవళ్లు శ్రమించారు. సుమారు నెల రోజుల తర్వాత మోటార్లు బయటపడగా వాటిని అధికారులు పరిశీలించారు. మూడో టీఎంసీకి సంబంధించి ఆరు మోటార్లు పూర్తిగా పనికిరాకుండా పోగా, రెండో టీఎంసీలోని 11 మోటార్లకు మరమ్మతులు చేపట్టేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఒకటి, రెండో నంబర్ల మోటార్లను పునరుద్ధరించి ఎత్తిపోతలను ప్రారంభించారు. ఈ పంపింగ్ ప్రక్రియను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. మిగతా మోటార్లను కూడా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.