Governor vs TS Govt: గవర్నర్ లేఖపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి సబిత
ABN , First Publish Date - 2022-11-09T16:55:34+05:30 IST
ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది.
హైదరాబాద్: ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్ లేఖపై సబిత స్పందించారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, గవర్నర్‌ని కలవమని ప్రభుత్వం తనను ఆదేశించిందని తెలిపారు. గవర్నర్‌ని కలిసి సందేహాలు నివృత్తి చేస్తామని సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీ (University)ల చట్ట సవరణ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్ (Raj Bhavan)కు రావాలని గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.
దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు. నిజానికి, ఆ లేఖను తొలుత విద్యా శాఖకు రాశారని ప్రచారం జరిగింది.
అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రెండు నెలలుగా తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్న గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ బిల్లులు చట్టంగా మారితే న్యాయపరమైన చిక్కులుంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్ మధ్య కొనసాగుతున్న రగడ.. తారాస్థాయికి చేరుకుంటోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. సెప్టెంబరు 12న విద్యాశాఖకు సంబంధించిన ఎనిమిది కీలక బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇందులో.. ప్రైవేటు వర్సిటీల బిల్లు, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటుచేయనున్న అటవీ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల నియామకాల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు.