YS Sharmila: షర్మిలను అరెస్ట్ చేయడంతో వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయం..
ABN , First Publish Date - 2022-11-29T16:32:58+05:30 IST
వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (YSRTP President Sharmila) అరెస్ట్‌తో హైదరాబాద్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. షర్మిలను అరెస్ట్ (Sharmila Arrest) చేసి ఎస్‌ఆర్ నగర్‌కు..
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (YSRTP President Sharmila) అరెస్ట్‌తో హైదరాబాద్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. షర్మిలను అరెస్ట్ (Sharmila Arrest) చేసి ఎస్‌ఆర్ నగర్‌కు (SR Nagar) తరలించారు. ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ (YS Vijayamma) వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో.. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో (Lotuspond House) నిరాహార దీక్షకు దిగారు. తన కూతుర్ని చూసేందుకు వెళుతుంటే అడ్డుకున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. షర్మిల అరెస్ట్ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ప్రగతి భవన్‌ను షర్మిల ముట్టడించనున్నారన్న సమాచారంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు.
షర్మిల డోర్ లాక్ చేసుకుని కారు లోపలే ఉన్నారు. దీంతో.. షర్మిల ఉన్న కారును క్రేన్‌తోనే లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను కారుతో సహా తరలించారు. పీఎస్‌కు వెళ్లగానే.. బలవంతంగా షర్మిల కారు డోర్లు పోలీసులు తెరిచారు. పోలీసులు షర్మిలను కారు నుంచి బయటకు లాగేశారు. అనంతరం.. ఆమెను పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. ఇదిలా ఉండగా.. షర్మిల అరెస్ట్‌తో ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ దగ్గర వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. షర్మిలను విడుదల చేయాలని బిల్డింగ్ పైకి ఎక్కి కార్యకర్తల నినాదాలు చేశారు. విడుదల చేయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకేస్తామంటూ బెదిరించారు.
అసలేం జరిగిందంటే..
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వరంగల్ జిల్లాలో చేసిన పాదయాత్ర రణరంగంగా మారింది. వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. షర్మిల క్యారవాన్‌కు నిప్పు పెట్టారు. పాదయాత్రను అడ్డుకునేందుకు అడుగడునా ప్రయత్నించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరంగం సృష్టించారు. షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తరలించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైంది. చెన్నారావుపేట, ఖాదర్‌పేట, జల్లి మీదుగా శంకరమ్మతండా దగ్గరికి చేరుకోగానే టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుతగలడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఉదయం నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు తగులుతూనే ఉన్నారు. కాగా, 3500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశానని, ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని షర్మిల అన్నారు. స్థానిక నేతల అక్రమాలను ఎండగట్టడం తప్పా అని ప్రశ్నించారు. ఒక ప్లాన్ ప్రకారమే పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. పోలీసుల కళ్లెదుటే దుండగులు తిరుగుతూ, రాళ్లతో దాడులు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే అని అన్నారు.