AP News: విశాఖలో కొవిడ్‌ లక్షణాలతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-04-19T21:22:23+05:30 IST

నగరంలో కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఒక యువకుడు (21) మృతిచెందాడు. మాధవధారలోని లవ్‌ అండ్‌ కేర్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఎన్‌జీవో హోమ్‌లో ఉంటున్న..

AP News: విశాఖలో కొవిడ్‌ లక్షణాలతో యువకుడి మృతి

విశాఖపట్నం: నగరంలో కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఒక యువకుడు (21) మృతిచెందాడు. మాధవధారలోని లవ్‌ అండ్‌ కేర్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఎన్‌జీవో హోమ్‌లో ఉంటున్న 21 యువకుడు సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల కిందట జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో హోమ్‌ సిబ్బంది స్థానిక ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆరోగ్య సిబ్బంది సదరు యువకుడికి కరోనా ర్యాపిడ్‌ యాంటీ జెన్‌ (Rapid anti gen) పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఉన్నతాధికారుల సూచనలతో ఈ నెల 17న కేజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డు (Isolation ward)లో చేర్పించారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున సదరు యువకుడు చనిపోయాడు. అయితే ఆ యువకుడి మృతికి కొవిడ్‌ కారణం కాదని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వారికి ఆర్‌పీసీఆర్‌ పరీక్ష చేస్తామని, ఆ యువకుడికి నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జగదీశ్వరరావు తెలిపారు. లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌, న్యుమోనియాతో ఆ యువకుడు మృతి చెందినట్టు ఆయన వెల్లడించారు.

మరో చిన్నారికి పాజిటివ్‌

ఆ యువకుడికి పాజిటివ్‌ వచ్చిన వెంటనే హోమ్‌లోని మిగిలిన చిన్నారులకు కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. అయితే బుధవారం పదేళ్ల బాలికకు జ్వరంగా ఉందని ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందింది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో సదరు చిన్నారిని బుధవారం సాయంత్రం కేజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ చిన్నారి కూడా సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు. చిన్నారి బలహీనంగా ఉందని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే వున్నట్టు తెలిపారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించేందుకు నమూనాలు సేకరించామని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-04-19T21:22:23+05:30 IST