బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
ABN , First Publish Date - 2023-03-21T01:00:49+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అన్నారు.
న్యాయ పోరాటానికి ప్రభుత్వ సాయం
బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక భూములు
మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు చోటు
యువగళం పాదయాత్రలో నారా లోకేశ
కదిరి/తనకల్లు/నల్లచెరువు మార్చి 20: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అన్నారు. యువగళం పాదయాత్ర సోమవారం కదిరికి చేరింది. పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో బీసీలతో మాటమంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేశ మాట్లాడుతూ, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, న్యాయం కోసం వారు చేసే పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే సాయం అందిస్తుందని అన్నారు. బీసీల్లోని ఉప కులాలకు కమ్యూనిటీ భవనాలు, నిధులు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేటాయిస్తామని అన్నారు. నాయీ బ్రాహ్మణులకు, రజకులకు శవాసన మండలిలో అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. బీసీ కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లు ఆదరణ పథకం కింద ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఆదరణ -2లో కొనుగోలు చేసిన పనిముట్లను వైసీపీ ప్రభుత్వం మూలన పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల్లో ఉన్న అనేక ఉపకులాల సమస్యల పరిష్కారం కోసం సత్యపాల్ కమిటీని నాటి టీడీపీ ప్రభుత్వం వేసిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఆ రిపోర్టును బయటికు తీసి అమలు చేస్తామని అన్నారు. కల్లు గీత కార్మికులకు రూ.పది లక్షల బీమా కల్పిస్తామని, మద్యం షాపుల్లో కల్లుగీత కార్మికులకు కొంతభాగం కేటాయిస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక బీసీలను మోసం చేసిందని, కార్పొరేషనన్లు ఏర్పాట్లు చేసి కూర్చీలు కూడా లేకుండా చేసిందని విమర్శించారు. బీసీలకు ప్రత్యేకంగా భూములు కేటాయించి, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.
దిశ చట్టం ఒక మోసమని అన్నారు. ఒక్క కేసులో కూడా ఇంతవరకు 21 రోజుల్లో శిక్షపడేలా చేయలేదని అన్నారు. వైసీపీ పాలనలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. గనకంటే ముందుగా వస్తానన్న జగన మహిళలను చంపుతుంటే ఎక్కడ అని ప్రశ్నించారు.
భవన నిర్మాణ కార్మికుల బోర్డుకు నిధులు కేటాయించి, అవి వారి అవసరానికే ఉపయోగపడేలా చేస్తామని అన్నారు. ఇసుక, సిమెంటు ధరలు విపరీతంగా పెరిగి, భవన నిర్మాణ కార్మికులు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోయేలా చేశారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
మాట మార్చడం మడమ తిప్పడం జగనకు అలవాటుగా మారిందని విమర్శించారు. సొంత బాబాయిని చంపేసి, చంద్రబాబు చంపేశాడని నటించారని, ట్రిపుల్ ఆర్ సినిమాలో జగన నటి ంచి ఉంటే ఆయనకు బెస్ట్ అవార్డు వచ్చేదని ఎద్దేవా చేశారు. జగన ఒకసారి ఢిల్లీ వెళ్లిరావడానికి రూ.కోటి ఖర్చు అవుతుందన్నారు. జగనకు సౌండ్ ఎక్కువ, పని తక్కువ అని అన్నారు.
కదిరి నియోజకవర్గస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని లోకేశ అన్నారు. కదిరిలో టీడీపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకట ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.