వలంటీర్‌పై దాడి

ABN , First Publish Date - 2023-07-06T23:47:33+05:30 IST

వలంటీర్‌పై దాడి

వలంటీర్‌పై దాడి

- బియ్యం తూకంలో అదనంగా రాళ్లు

ఓబుళదేవరచెరువు, జూలై 6: పేదల నిత్యావసర వస్తువుల తూకాల్లో అదనంగా రాయి పెట్టి, మోసం చేస్తున్నారని నిలదీసినందుకు వలంటీర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. బాధిత వలంటీర్‌ ఇర్షాన తెలిపిన వివరాలివి. ఇంటింటికీ రేషనబండి ఆపరేటర్‌ జబ్బార్‌, అతని అనుచరులు పేదలకు బియ్యం పంపిణీ చేస్తూ, అదనంగా రాయి పెట్టడాన్ని గమనించి ప్రశ్నించినట్లు చెప్పారు. వారు చేస్తున్న మోసాన్ని సెల్‌ ఫోనలో చిత్రీకరిస్తుండగా, ఎండీయూ ఆపరేటర్‌ బబ్బార్‌, అతని అనుచరులు తనతోపాటు తనతండ్రి మున్నాపై దాడి చేసినట్లు వాపోయాడు. గాయాలు కావడంతో కదిరి ప్రభుత్వ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 20 కేజీల బియ్యానికి ఒక కేజీ, పది కేజీల బియ్యానికి అర కేజీ రాయిని పెట్టి ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేసినట్లు ఆవేదన చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

ఎండీయూ ఆపరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆర్సీపీ ధర్నా

అవినీతిని ప్రశ్నిస్తే వలంటీర్‌పై దాడిచేయడం హేయమైన చర్య అని ఆర్సీపీ జిల్లా కార్యదర్శి డాక్టర్‌ నాగన్న, ఆవాజ్‌ కమిటీ జిల్లా నాయకులు టీఎండీ ఇలియాజ్‌, డివిజన కార్యదర్శి మున్నా ఖండించారు. ఎండీయూ ఆపరేటర్‌ అబ్దుల్‌ జబ్బార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం స్థానికంగా ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకిస్తున్న రేషన తూకాల్లో మోసాలు అరికట్టాలని, తప్పుడు తూకాలు వేస్తున్న ఎండీయూ ఆపరేటర్‌ జబ్బార్‌పై చర్యతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవినీతిపై ప్రశ్నించిన వలంటీర్‌పై దాడిచేయడంపై వారు ఆగ్రహించారు. దాడిచేసిన జబ్బార్‌, అతని అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ రామనాథ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కుంట్లపల్లి సుగుణమ్మ, అరుణమ్మ, వెంకటలక్ష్మీ, అరుణకుమార్‌, శశి, రాజేష్‌, రాజగోపాల్‌, మణికుమార్‌, ఆంజి, వెంకటేష్‌, శాంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-06T23:48:28+05:30 IST