పెచ్చులూడిన గదులే...
ABN , First Publish Date - 2023-06-14T00:11:56+05:30 IST
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు దుస్థితిలో కొనసాగుతున్నాయి. పెచ్చులూడిన తరగతి గదులే విద్యార్థులకు దిక్కయ్యాయి.
అసంపూర్తిగా నాడు-నేడు పనులు
శిథిలావస్థలో తరగతి గదులు
చదువులు సాగేదెలా?
ఓబుళదేవరచెరువు, జూన 13: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు దుస్థితిలో కొనసాగుతున్నాయి. పెచ్చులూడిన తరగతి గదులే విద్యార్థులకు దిక్కయ్యాయి. భయం భ యంగా చదువులు కొనసాగించాల్సి వస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమైనా నాడు-నేడు పనులన్నీ పడకేశాయి. అసంపూర్తి భవనాలే దర్శనమిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లోనే విద్యను అభ్యసించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీర ఓబునపల్లి, జంబులవాండ్లపల్లి, రామిరెడ్డిపల్లి మండలపరిషత పాఠశాలల్లో అసౌకర్యాలు తిష్టవేశాయి. తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. రామిరెడ్డిపల్లిలో పాత గదిలో పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. వర్షం వస్తే కారుతోంది. పాఠశాల గోడలు పాచి పట్టాయి. వీర ఓబునపల్లి పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి, కడ్డీలు దర్శనమిస్తున్నాయి. వర్షం వస్తే తడవాల్సిందే. జంబులవాండ్లపల్లి ప్రాథమిక పాఠశాలోనూ ఇదే పరిస్థితి. ఈయేడు విద్యా సంవత్సరంలో కష్టాలు తప్పవని తల్లిదండ్రులు వాపోతున్నారు.
మండలవ్యాప్తంగా నాడు-నేడు రెండో దశ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. 33 పాఠశాలల్లో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు 16 పాఠశాలల్లో నిర్మాణాలకు సంబంధించి రివాల్వింగ్ ఫండ్ రావాల్సి ఉంది. ఆ నిధులు వస్తేనే బిల్లులతో కాంట్రాక్టర్లు పనులను ముందుకు సాగిస్తారు. విద్యాసంవత్సరం పునఃప్రారంభం నాటికి నాడు-నేడు రెండో దశ పనులు పూర్తికావాలని అధికారులు ఆదేశాలిచ్చినా, పనులు మాత్రం స్తంభించాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2వ విడత నాడు-నేడు పనులు 23 పాఠశాలలకు మంజూరు కాలేదు. ఉన్న నిధులు కేవలం మైనర్ మరమ్మతులకే సరిపోతున్నాయి. మేజర్ మరమ్మతులకు ఏమాత్రం చాలవు. పైకప్పు పెచ్చులూడి శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల గదుల సంగతి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
రానున్నది వర్షాకాలం. వర్షాలు వస్తే చాలా ప్రభుత్వ పాఠశాలల గదులు కారుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కష్టాలు తప్పవన్నట్లు ఉన్నాయి. అఽధికారులు మాత్రం మూడో విడత నాడు-నేడు పనుల్లో మరమ్మతులు చేయిస్తామంటున్నారు.
కొన్నేళ్లుగా పాఠశాలల పైకప్పులు పెచ్చులూడి భయం భయంగా విద్యార్థులు చదువుకుంటున్నారు. మరమ్మతు చేయాలని గ్రామస్థులు, ప్రధానోపాధ్యాయులు విన్నవించినా ఫలితంలేదు. వర్షం వస్తే ఆరోజు పాఠశాలలకు సెలవు వదలక తప్పదు. లేకుంటే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తడవాల్సి వస్తోంది. పాలకులు, అధికారులు స్పందించి పాఠశాలలకు మరమ్మతులు చేయించాలి.
మూడో విడతలో మరమ్మతులు చేయిస్తాం
- ఖాదర్‌వలి, మండల విద్యాశాఖాధికారి
మూడో విడత నాడు-నేడు నిధులతో దెబ్బతిన్న పాఠశాలలకు మరమ్మతులు చే యిస్తాం. అవసరమైతే మండల గ్రాంట్‌కు ప్రతిపాదిస్తాం. నాడు-నేడు రెండవ విడత పనులు మండలవ్యాప్తంగా 33 పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో 16 పాఠశాలల నిర్మాణాలకు సంబంధించి రివాల్వింగ్ ఫండ్ రావాల్సి ఉంది. అన్ని పాఠశాలలను పర్యవేక్షించి, మరమ్మతులు చేపడతాం.