175 నియోజకవర్గాల్లో బైబై జగన్!
ABN , First Publish Date - 2023-03-20T01:48:13+05:30 IST
మూడు రాజధానుల మూడు ముక్కల సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం మొట్టికాయలు వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 47వ రోజు(ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో 11.7 కిలోమీటర్లు సాగింది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ స్వీప్ ఖాయం: లోకేశ్
యువగళం 47వ రోజు 11.7 కిలోమీటర్లు నడక
పుట్టపర్తి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల మూడు ముక్కల సీఎం జగన్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం మొట్టికాయలు వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్ర 47వ రోజు(ఆదివారం) శ్రీసత్యసాయి జిల్లాలో 11.7 కిలోమీటర్లు సాగింది. నల్లచెరువు మండలం చిన్నపల్లోలపల్లి నుంచి జోగన్నపేట వరకు నడవడంతో మొత్తం 602.7 కిలోమీటర్లు నడిచినట్లైంది. ఈ సందర్భంగా పాదయాత్ర 600 కిలోమీటర్ల మైలు రాయిని చిన్నయల్లంపల్లి వద్ద లోకేశ్ ఆవిష్కరించారు. పాదయాత్రలో పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోగన్నపేట బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ ‘నా వెంట్రుక కూడా పీకలేరన్న జగన్‌కు ఇప్పుడు ప్రజలు ఓటుతో గుండు కొట్టారు’ అని ఎద్దేవా చేశారు. జగన్ వైనాట్ 175 అంటున్నాడనీ, ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో బైబై జగన్ అంటున్నారన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారని, ఇది సైకో పాలనపై ప్రజల విజయమని చెప్పారు. ఇది ట్రైలర్ మాత్రమేననీ, అసలు సినిమా 2024లో చూపిస్తామని తెలిపారు. జగన్ రాయలసీమ బిడ్డ కాదనీ, సీమకు పట్టిన కేన్సర్ గడ్డని ఎద్దేవా చేశారు. కియా తదితర పరిశ్రమలు అనంతకు తీసుకొచ్చిన నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబే అని, జగన్‌ను చూసి పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నాయన్నాయని చెప్పారు. ఫలితంగా రాయలసీమ బిడ్డలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు.
‘చరిత్రలో ఎక్కడైనా అధికార పార్టీ అభ్యర్థి ధర్నా చేయడం చూశామా?.. అదీ పసుపు జెండా పవర్. భయాన్ని జగన్‌కు పరిచయం చేస్తాం. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సైకిల్ స్వీప్ చేయడం ఖాయం. ఫ్యాన్ రెక్కలు విరగడం తథ్యం’ అన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.5,300 కోట్లు కేటాయించిందని, అది పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నారని, అన్నింటి ధరలు పెంచి బాదుడే బాదుడు చేపట్టారని విమర్శించారు. పాదయాత్రకు జనం పోటెత్తగా దారిపొడవునా ప్రజలతో మమేకమై ముందుకు సాగారు. రత్నాలపల్లిలో కురుబ కులస్థులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. జగన్ ప్రభుత్వం కుర్చీలులేని కార్పొరేషన్లతో బీసీలకు అన్యాయం చేసిందని, తాము అఽధికారంలోకి వస్తే కురుబల అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. చేనేతలతోనూ లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.