చంద్రబాబు ఓ విజనరీ

ABN , First Publish Date - 2023-03-31T00:19:53+05:30 IST

చంద్రబాబు ఒక విజనరీ అని, ఈ విషయం గూగుల్‌ చెబుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అన్నారు. యువగళం పాదయాత్ర 55వ రోజున కియ సమీపంలో 700 కి.మీ. పూర్తి చేసుకుంది.

చంద్రబాబు ఓ విజనరీ
కియా పరిశ్రమ వద్ద కారుతో సెల్ఫీ

గూగుల్‌ అదే చెబుతుంది

జగన మూడేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టాడా?

హత్యలు, గంజాయిలో వైసీపీ ముందంజ

దళితులపై దాడులు.. బీసీలపై కేసులు

విలేకరులతో లోకేశ ముఖాముఖి

పుట్టపర్తి (ఆంధ్రజ్యోతి)/హిందూపురం, మార్చి 30: చంద్రబాబు ఒక విజనరీ అని, ఈ విషయం గూగుల్‌ చెబుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ అన్నారు. యువగళం పాదయాత్ర 55వ రోజున కియ సమీపంలో 700 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన పాదయాత్రలో ఇప్పటి వరకు గమనించిన అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు.

పాదయాత్రకు ముందు.. ఇప్పుడు మీలో తేడా ఏమిటి?

లోకేశ: టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలయ్యాయి, ప్రజలు వాటిపట్ల ఆనందంగా ఉన్నారా లేదా అనే విషయం ప్రస్తుతం నేను గమనిస్తున్నా. రజకులకు వాషింగ్‌ మిషన్లు ఇచ్చాం. కానీ కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు వారు చెబుతుంటే వింటున్నాం. అందుకే 500 యూనిట్ల వరకు వారికి సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. అదేవిధంగా ప్రతి పథకంలో లోపాలను గుర్తించి సరిదిద్దుకుంటాం.

పాదయాత్రలో మీరు గమనించిన ప్రధాన సమస్యలేమిటి ?

లోకేశ: రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సరఫరా రెండో ప్రధాన సమస్య. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం పన్నుల భారం మోపడంతో ఇబ్బందులు పడుతున్నారు.

పాదయాత్రలో మీ మనసును కలిచివేసిన ఘటన ఏది ?

లోకేశ: ప్రధానంగా రెండు ఘటనలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. సత్యవేడు నియోజకవర్గం దాటుతుండగా 200 కి.మీ. చివరిలో ఓ మహిళ బోండాలు తయారుచేసి అమ్ముతోంది. ఆమె వద్దకు వెళ్లి టీడీపీ ప్రభుత్వం వచ్చాక నీకు ఏం కావాలి కోరుకో అని అడిగా. ‘నేను చిన్న హోటల్‌ నడుపుతూ నా కొడుకులను ఇద్దరిని చదివించాను. వారికి ఉద్యోగాలు లేవు. మీ ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇప్పించండి’ అని ఆమె కోరింది. రెండో ఘటన.. పలమనేరులో మిస్బా ఆత్మహత్య. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అరాచకాలు సాగిస్తున్నారు. వైసీపీ నాయకుడు సుధాకర్‌ కూతురుకు రెండో ర్యాంక్‌, మిస్బాకు మొదటి ర్యాంక్‌ వస్తోందని బలవంతంగా టీసీ ఇచ్చి పంపేశారు. దీంతో ఆ చెల్లి మిస్బా ఆత్మహత్య చేసుకుంది. తాను బాగా చదువుకోవాలని డాక్టర్‌ కావాలని తన డ్రాయింగ్‌ పుస్తకంలో రాసుకున్న విషయం తెలిసి తీవ్రంగా కలత చెందాను.

పాదయాత్రలో కాళ్ల నొప్పులు వస్తాయి. అది మరిచిపోయేంత ఆనందం ఎక్కడైనా కనిపించిందా ?

లోకేశ: నేను పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా ఓ మహిళా ఉద్యోగి నావద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించింది. ‘గతంలో నేను ఇంటిని చూసుకునేదాన్ని. కంపెనీలు మా ప్రాంతానికి రావడంతో ఉద్యోగం చేస్తున్నాను. మా పిల్లల్ని, ఇంటిని చాలా చక్కగా చూసుకోగలుగుతున్నా’ అని చెప్పింది. ఆమె మాటలతో నాలో ఆనందం ఉప్పొంగింది. నా కాళ్ల నొప్పులు మరిచిపోయాను. మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే బలమైన కోరిక ఏర్పడింది.

సెల్ఫీ విత లోకేశ, సెల్ఫీ చాలెంజ్‌.. ఈ రెండింటిలో మీకేది ఇష్టం ?

లోకేశ: నాకు ఈ రెండు కార్యక్రమాలంటే అమితమైన ఇష్టం. సెల్ఫీ విత లోకేశ.. సామాన్యులను కలుసుకుని, వారి సమస్యల తెలుసుకునే అవకాశం కల్పించింది. సెల్ఫీ చాలెంజ్‌తో మేము గతంలో ఏం చేశామో, వైసీపీ ప్రభుత్వం ఎంత విఫలమైందో రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి బాగా ఉపయోగపడుతోంది. నేను ఇప్పటి వరకు అనేక సెల్ఫీ చాలెంజ్‌లు ప్రభుత్వానికి విసిరాను. దీనిపై ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా స్పందించలేదు.

నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి మీ ప్రణాళిక ఏది ?

లోకేశ: నిరుద్యోగ సమస్యను మూడు రకాలుగా పరిష్కరించాలి. ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలు తెచ్చి వాటిలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం ఒప్పుకుంది. భవిష్యత్తులో కూడా పెట్టుబడులు తెచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. తప్పకుండా తెస్తాం. రెండోది ప్రభుత్వ రంగంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలి. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖాళీలన్నీ జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా భర్తీ చేస్తాం. స్వయం ఉపాధి ద్వారా యువతకు జీవనోపాధి కల్పిస్తాం. యువ పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దుతాం.

ప్రత్యక్షంగా 25 వేల మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన కియ కంపెనీ మీముందుంది. ఎలా తీసుకొచ్చారు. ?

లోకేశ: చంద్రబాబు అంటే ఒక బ్రాండ్‌. విజనరీకి మారుపేరు ఆయన. క్యాబినెట్‌ కూర్పులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సమర్థులకే ఆయన మంత్రి పదవి కట్టబెడతారు. ఉమ్మడి అనంతను మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌గా తీర్చిదిద్దాలన్నదే మా ఉద్దేశం. కడప ఉక్కు, కర్నూలుకు సిమెంటు ఫ్యాక్టరీ, చిత్తూరుకు ఎలక్ర్టానిక్స్‌ ఫ్యాక్టరీ, ప్రకాశం జిల్లాకు పేపర్‌మిల్‌, గుంటూరు, క్రిష్ణకు రాజధాని ఉన్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు ఫిషరీస్‌, ఫార్మ డిఫెన్స డెవల్‌పమెంట్‌, ఉత్తరాంధ్రకు ఐటీ.. ఇలా అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుది. ఒక్కటే రాజధాని ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నది మా నినాదం. కియ, టీసీఎల్‌, పాక్స్‌కాన, డిక్సన, సెల్కాన, ఆదాని డేటా సెంటర్‌, డిఫెన్స అకాడమి రాజధానిలో లేవు. బాబు మరోసారి సీఎం అయి ఉంటే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేలా కంపెనీలు వచ్చేవి. కియ వల్ల ఉమ్మడి అనంతలో తలసరి ఆదాయం రూ.30వేలు పెరిగింది. ఇంకా ఎన్నాళ్లు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణవైపు చూడాలి..? మనం ఎందుకు నంబర్‌ వన కాకూడదు? ఇదే చంద్రబాబు నినాదం. అందుకే కియను తెచ్చి చూపించాం.

కియ లోగో చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది?

లోకేశ: కిమ కంపెనీ లోగో చూస్తుంటే ఆనందంగా ఉంది. కానీ దానిని తీసుకురావడం వెనుక చాలా కష్టం ఉంది. ఉమ్మడి జిల్లాకు సంక్షేమ పథకాలు అమలు చేశాం. కియ పరిశ్రమ పెట్టాం. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారని చాలా బాధపడ్డాను. అందుకే నేను సెల్ఫీ చాలెంజ్‌ కార్యక్రమాన్ని తీసుకున్నాను. దీనిద్వారా మేం ఏం చేశాం. వైసీపీ ఏం చేసింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది. పెనుకొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయని నేను చూసేవరకు నాకే తెలియదు. వాటిని చూశాక ఇన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నాయా అని నేను ఆశ్చర్యపోయాను. టీడీపీ బలం సమర్థవంతంగా పనులు చేయడం, చేసిన పనులను చెప్పుకోకపోవడం బలహీనతగా గుర్తించాం. అందుకే ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి టీడీపీ ఏం చేసిందో చెప్పదలచుకున్నా.

ఒక్కరాజధానితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు, మూడు రాజధానులతో సాధ్యమని అధికార పార్టీ అంటోంది..

లోకేశ: మూడు రాజధానులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి మూడేళ్లయింది. ఈ మూడు రాజధానుల్లో ఒక్క ఇటుకైనా వారు పెట్టారా? మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదు. కియ పరిశ్రమను తన పాదయాత్రలో జగనచూసి ఫేక్‌ కంపెనీ అని విమర్శించారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇది ఫేక్‌ కంపెనీనా? నిజమైన కంపెనీనా? రాష్ట్ర ప్రజలు గమనించాలి. జగనరెడ్డి చెప్పేది అబద్ధమా.. నిజమా అన్నది తెలుసుకోవాలి.

అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉందని వైసీపీ చెబుతోంది. దీనిపై మీ అభిప్రాయం ?

లోకేశ: హత్యలు, గంజాయి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడంలో చివరి స్థానంలో ఉన్నారు.

ప్రతి వంద కి.మీ. ఒక హామీ ఇస్తున్నారు. వాటి అమలు సాధ్యమేనా ?

లోకేశ: నేనిచ్చే హామీని అమలుచేయడం నూటికి నూరుశాతం సాధ్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. ఆర్థికపరమైన అంశాల గురించి మేము ఆలోచించం. ప్రజల సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలన్నదే మా ఆలోచన. ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలో మాకు స్పష్టత ఉంది.

55 రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులు గమనించారా ?

లోకేశ: యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున వస్తున్నారు. పార్టీలో అధికంగా భాగస్వామ్యం అవుతున్నారు. పార్టీలో యువతను పెద్దఎత్తున ప్రోత్సహించాలన్న అంశాన్ని మేం గమనించాం. రానున్న కాలంలో అమలు చేస్తాం. వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మేం అధికారంలోకి వచ్చాక వారి ప్రాణాలకు భరోసా ఇస్తాం. వారికోసం చట్టాలను కఠినతరం చేస్తాం. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌, దళితుడైన సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపి డోర్‌ డెలివరీ చేశాడు. అనంతబాబు బెయిల్‌పై బయటకు వస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మేం అధికారంలోకి వచ్చాక దళితులపై చేయి వేయాలంటే భయపడే విధంగా చట్టాలు అమలు చేస్తాం. అదే సందర్భంలో బీసీలకు కూడా పూర్తిరక్షణ కల్పిస్తాం

Updated Date - 2023-03-31T00:19:53+05:30 IST