చెరువులపై చిన్నచూపు..!
ABN , First Publish Date - 2023-03-07T00:09:30+05:30 IST
వ్యవసాయానికి కీలకమైన చెరువులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వాటి పరిరక్షణను గాలికొదిలేసింది. కనీస మరమ్మతులు కూడా చేయట్లేదు. చేసిన తాత్కాలిక మరమ్మతులకు కూడా బిల్లులివ్వట్లేదు. మైనర్ ఇరిగేషన శాఖ పరిధిలో మూడేళ్లుగా నిధులు మంజూరుకాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
మూడేళ్లుగా ప్రతిపాదనలతోనే సరి..
తాత్కాలిక మరమ్మతుల బిల్లులూ పెండింగ్
నిధుల్లేక స్తంభించిన పనులు
మడకశిర, మార్చి 6: వ్యవసాయానికి కీలకమైన చెరువులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వాటి పరిరక్షణను గాలికొదిలేసింది. కనీస మరమ్మతులు కూడా చేయట్లేదు. చేసిన తాత్కాలిక మరమ్మతులకు కూడా బిల్లులివ్వట్లేదు. మైనర్ ఇరిగేషన శాఖ పరిధిలో మూడేళ్లుగా నిధులు మంజూరుకాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అధికారులు.. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారే తప్ప.. నిధులు మాత్రం మంజూరుకావట్లేదు. చెరువుల్లో పూడిక పేరుకుపోయి, కంపచెట్లు పెరిగి కట్టలు దెబ్బతినడంతో వర్షపు నీరంతా వృథాగా పోతోంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడం లేదు. చేసిన పనులకు నేటికీ బిల్లులు మంజూరు కావడం లేదు. పనులు చేసిన వారు కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. తెగిన చెరువులకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోతే ఆ చెరువులు తెగిపోయే అవకాశాలున్నాయి. నిధులు రాక ఆ పనులు అటకెక్కాయి.
తాత్కాలిక పనులకూ అంతే..
2021-2022 సంవత్సరంలో జిల్లాలో భారీ వరదలకు 20 దాకా చెరువులు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా వాటి మరమ్మతులను ఇరిగేషన శాఖ వారు, చెరువు ఆయకట్టుదారులతో చేపట్టారు. అందుకు వెచ్చించిన రూ.40 లక్షలకు సంబంధించిన బిల్లులు నేటికీ మంజూరు కాలేదు. 2022-23లో భారీ వర్షాలకు 19 చెరువులు దెబ్బతిన్నాయి. రూ.40 లక్షలతో వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నేటికీ బిల్లులు మంజూరు కాలేదు. మడకశిర సబ్ డివిజన పరిధిలో వైబి హళ్ళి చెరువుకు రూ.1.80 లక్షలు, చౌటిపల్లికి రూ.1.80 లక్షలు, గుడిబండ మండలం కరికెర చెరువుకు రూ.లక్ష, అమరాపురానికి రూ.1.20 లక్షలు, రంగనాథ చెరువుకు రూ.1.20 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దెబ్బతిన్న, వర్షాలకు తెగిన చెరువులకు మరమ్మతులు చేపట్టకపోతే దెబ్బతినే అవకాశం ఉంది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
ఇరిగేషన శాఖలో టీడీపీ హయాంలో నీరు-చెట్టు కింద చేపట్టిన పనులకు నేటికీ బిల్లులు అందలేదు. పనులు చేసినవారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో కొంతమంది కోర్టులను ఆశ్రయించారు కూడా. కోర్టు ఆదేశాలతో వారికి బిల్లులు మంజూరవుతున్నాయి. మరికొంత మంది కూడా కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారు. నీరు-చెట్టు పనులకు సంబంధించి 450 మందికి బిల్లులు చెల్లించాల్సి ఉంది. నిధుల కొరతతో వారికి నిరాశ తప్పట్లేదు.
మూడేళ్లుగా ప్రతిపాదనలు
జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలోని చెరువుల మరమ్మతులకు సంబంధించి ఆర్‌ఆర్‌ఆర్ కింద 452 పనులకు రూ.32.08 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఏటా ప్రతిపాదనలను కాస్త అటుఇటుగా మార్చి పంపుతూనే ఉన్నారు. నేటికీ నిధులు మా త్రం మంజూరు కాలేదు. చెరువులు మరమ్మతులకు నోచుకోక సం వత్సరాలు గడుస్తున్నాయి. చెరువు కట్టలపై కంపచెట్లు ద ట్టంగా పెరిగాయి. వర్షాలు వచ్చినపుడల్లా పలుచోట్ల లీకేజీలు ఏర్పడి, నీరు వృథా అవుతోంది. తూముల మరమ్మతులు చేపడితే నీటి వృథాను అరికట్టే అవకాశం ఉంది. పూడికను తొలిగిస్తే నీరు నిండి, భూగర్భజలాలు పెంపొందే వీలుంటుంది.
నిధులు మంజూరవగానే పనులు చేపడతాం
చెరువుల మరమ్మతులకు రూ.32.08 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. మంజూరైన వెంటనే పనులు చేపడతాం. 2021-23 సంవత్సరాల మధ్య జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు 39 దాకా చెరువులు దెబ్బతిన్నాయి. తాత్కాలికంగా వాటి మరమ్మతులను ఇరిగేషన శాఖ.. చెరువు ఆయకట్టుదారులతో కలిసి చేపట్టింది. పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సి ఉంది.
- నారాయణనాయక్, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ