కబ్జాదారులకు బేడీలు వేయిస్తాం

ABN , First Publish Date - 2023-06-01T23:44:29+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు బేడీలు వేసి, నడిరోడ్డుపై నడిపిస్తామని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.

కబ్జాదారులకు బేడీలు వేయిస్తాం
ఆలయ భూమిని పరిశీలిస్తున్న నిమ్మల కిష్టప్ప, సవిత

మాజీ ఎంపీ నిమ్మల

గోరంట్ల, జూన 1: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు బేడీలు వేసి, నడిరోడ్డుపై నడిపిస్తామని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు. మండలంలోని బూదిలి శ్రీకోటిలింగేశ్వర స్వామి ఆలయ మాన్యం భూమి 4.09 ఎకరాలను వైసీపీ నాయకులు బినామీ పేర్లతో కబ్జా చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పొలాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితతో కలిసి నిమ్మల గురువారం పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడారు. మాన్యం భూమి అన్యాక్రాంతం కాకుండా టీడీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. వైసీపీ నాయకులు మాన్యం భూములను సైతం వదిలే పరిస్థిలో లేరని నిమ్మల ఆరోపించారు. దేవుడి భూముల జోలికెళ్లినవారు సర్వనాశనం అయిపోతారన్నారు. ఎమ్మెల్యే శ్మశనాలను సైతం వదిలేలా లేరన్నారు. మాన్యం భూమి కబ్జా విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కబ్జాదారులపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జనసేన వినతి

బూదిలి శ్రీకోటిలింగేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని జనసేన జిల్లా కార్యదర్శి సురేష్‌ కోరారు. ఆ మేరకు ఆయన ఆధ్వర్యంలో జనసేన నాయకులు.. తహసీల్దార్‌ రంగనాయకులకు వినతిపత్రం అందజేశారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తహసీల్దార్‌ విచారణ

బూదిలి శ్రీకోటిలింగేశ్వరస్వామి ఆలయ భూమి వివాదంపై ఇరువర్గాల వారితో తహసీల్దార్‌ రంగనాయకులు విచారణ చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజశేఖరప్ప, వైసీపీ మండల కన్వీనర్‌ సోదరులు రంగప్ప, నారాయణస్వామి, గుత్తివారిపల్లి రామాంజనేయులును తహసీల్దార్‌ కార్యాయానికి పిలిపించుకుని, వారి హక్కు పత్రాలను పరిశీలించారు. ధరణి బసమ్మ దానం చేసిన ఆలయ భూమికి సంబంధించి అన్నీ సక్రంగా ఉన్నాయని తహసీల్దార్‌ తెలిపారు. గుత్తివారిపల్లి నరసింహప్ప నుంచి మూడున్నర ఎకరాల భూమి కొన్న మల్లసముద్రం గొల ్లరంగప్పకు ఎలాంటి హక్కు, ఆధారాలు లేవని, కేవలం వెబ్‌ల్యాండ్‌ నమోదు అయిందన్న ఆధారంతో భూమిని విక్రయించినట్లు ఆయన మనవడు రామాంజనేయులు స్వయంగా అంగీకరించారు. దేవుని మాన్యం భూమికి సంబంధించి ఇప్పటివరకు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోలేదన్నారు. సర్వేనెంబరు 532లో 19.36 ఎకరాలు 12 మంది ఆధీనంలో ఉన్నట్లు రికార్డులు చేబుతున్నాయన్నారు. వారందరికీ నోటీసులిచ్చి, హక్కుదారులు కాని పక్షంలో వారి పాసుపుస్తకాలు రద్దు చేస్తామన్నారు. అర్హులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తామన్నారు. అప్పటి వరకు పొలంలోకి ఇరువర్గాలు ప్రవేశించరాదని ఆర్డీఓ ఆదేశించినట్లు తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - 2023-06-01T23:44:29+05:30 IST